
Indian Sailors | ఇంటర్నెట్‌డెస్క్: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబె వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడి కలకలం సృష్టించింది (US Attack On Ship). దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ
సిబ్బంది ఉండగా.. వారిలో ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని షిప్పింగ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్ ధ్రువీకరించారు. ఇది విషాదకరమైన ఘటన అని, ఆ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతులను డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేశ్‌గా గుర్తించారు. సురేశ్ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ నుంచి చమురు రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ట్యాంకర్‌పై కాల్పులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యపై ఆగ్రహం వ్యక్తంజేసింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపేయాలని... అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాలని పేర్కొంది. అంతేగాకుండా దిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్ మీక్స్‌ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. 24 మంది భారతీయులున్న మరో నౌకపై ఒమన్ తీరంలో అమెరికా నౌకాదళం మూడు రోజుల కిందట దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై తాజాగా దాడి జరిగింది. ఒమన్ తీరంలో ఆ నౌకపై అమెరికా మిలిటరీ దాడి చేసింది. వారంరోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజా ఘటనను ఒమన్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది. ‘‘ఈ రోజు ఉదయం ఒమన్‌లోని షినాస్ పోర్టు సమీపంలో నౌకపై దాడి జరిగింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని పేర్కొంది. ఈ నౌక పేరు జలవిహార్‌గా తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.