
రూ. లక్షలోపు బెస్ట్ మైలేజ్ బైక్స్ లీటర్‌కు 75 కిమీ వరకు మైలేజ్ పెట్రోల్ ఖర్చు తగ్గించే టాప్ ఎంపికలు Best Mileage Bikes: ప్రస్తుత కాలంలో బైక్ అనేది విలాసం కాదు.. అవసరంగా మారిపోయింది. ఉద్యోగానికి
వెళ్లాలన్నా, వ్యాపారం చూసుకోవాలన్నా, రోజువారీ పనులు చేసుకోవాలన్నా ద్విచక్ర వాహనం తప్పనిసరి అయిపోయింది. అయితే పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో వాహనదారుల దృష్టి ఇప్పుడు మైలేజ్ ఎక్కువగా ఇచ్చే బైక్‌లపై పడుతోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్, మెరుగైన పనితీరును అందించే బైక్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి, 2026లో రూ.1 లక్షలోపు ధరలో అత్యధిక మైలేజ్(Best Mileage Bikes) అందిస్తున్న ఐదు బైక్‌ల గురించి, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి (Hero Splendor Plus): భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. 97.2సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ OHC ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ లీటర్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. రోజువారీ ఉద్యోగ ప్రయాణాలు, చిన్న దూరాల ప్రయాణాలకు ఇది అత్యుత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.77,557 నుంచి రూ.80,331 వరకు ఉంది. * బజాజ్ ప్లాటినా (Bajaj Platina 110): ధర, పనితీరు, మైలేజ్ మధ్య సమతుల్యత కోరుకునే వారికి బజాజ్ ప్లాటినా 110 మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇది 115సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో 8.48 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెప్తోంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉండటంతో హైవేపై ప్రయాణించేటప్పుడు ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. CBS బ్రేకింగ్ సిస్టమ్ ఉండటం వల్ల బ్రేకింగ్ సమయంలో మెరుగైన నియంత్రణ లభిస్తుంది. ఈ బైక్ ధర రూ.70,800 నుంచి ప్రారంభమవుతుంది. * టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport): తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి టీవీఎస్ స్పోర్ట్ మంచి ఆప్షన్. ఈ జాబితాలోనే అత్యంత చౌకైన బైక్‌గా నిలిచిన టీవీఎస్ స్పోర్ట్ ధర కేవలం రూ.57,000 నుంచి ప్రారంభమవుతుంది. 109.7సీసీ ఇంజిన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్ 8.08 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో 70 నుంచి 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు. విద్యార్థులు, మొదటిసారి బైక్ కొనుగోలు చేసే వారికి ఇది మంచి ఎంపిక. * హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe): గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఒకటి. 97.2సీసీ ఇంజిన్‌తో 8.02 PS పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. వేరియంట్‌ను బట్టి ధర రూ.59,477 నుంచి రూ.72,792 వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా హీరోకు ఉన్న విస్తృత సర్వీస్ నెట్వర్క్ కారణంగా నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. * హోండా ఎస్పీ (Honda SP 125): ఈ జాబితాలో ప్రీమియం సెగ్మెంట్‌కు చెందిన బైక్ హోండా ఎస్పీ 125. 123.94సీసీ ఇంజిన్‌తో 10.87 PS పవర్, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పరంగా 60 నుంచి 65 కిలోమీటర్ల వరకు అందించినప్పటికీ, మెరుగైన ఇంజిన్ పనితీరు, ఆధునిక ఫీచర్లు, నాణ్యమైన నిర్మాణం దీనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. STD వేరియంట్ ధర రూ.85,564 కాగా, Bluetooth కనెక్టివిటీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వచ్చే DLX వేరియంట్ ధర రూ.93,152 వరకు ఉంటుంది. అదనంగా 3 సంవత్సరాలు లేదా 42,000 కిలోమీటర్ల వారంటీ కూడా లభిస్తుంది. కాబట్టి, పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ఈ బైక్‌లు మీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించగలవు.