
Asian Games 2026, IND vs PAK: ఆసియా క్రీడలు 2026 వేదికగా మరోసారి భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త యువ జట్టును
ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ సాహిబ్జాదా ఫర్హాన్ సారథ్యంలో ఎంపిక చేసిన ఈ యువ జట్టులో భారత్‌కు ముప్పుగా మారే ముగ్గురు ప్రమాదకర ఆటగాళ్లు ఉన్నారు.
పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారిస్తున్న కెప్టెన్..
భారత బౌలర్లకు మొదటి సవాల్ విసిరే ఆటగాడు పాకిస్తాన్ సరికొత్త కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ప్రస్తుత ఏడాదిలో అత్యద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. గత పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్తాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన ఫర్హాన్‌కు, భారత జట్టుపై అద్భుతమైన రికార్డు ఉంది. భారత్‌తో జరిగిన గత నాలుగు మ్యాచ్‌లలో ఇతడు దాదాపు 39 సగటుతో 155 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఆసియా కప్ 2025లో గ్రూప్ దశ నుంచి ఫైనల్ వరకు వరుసగా 40, 58, 57 పరుగులతో భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ప్రస్తుత సంవత్సరంలో కేవలం 11 మ్యాచ్‌లలోనే దాదాపు 50 సగటుతో, 155 పైగా స్ట్రైక్ రేట్‌తో 448 పరుగులు చేసి భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వేగంగా పరుగులు రాబట్టే ఇతడిని త్వరగా అవుట్ చేయడం భారత జట్టుకు ఎంతో కీలకం.
పాకిస్తాన్ బౌలింగ్ విభాగంలో భారత్‌ను విపరీతంగా కలవరపెట్టే మరో పేరు సుఫియాన్ ముఖీమ్. ఈ 24 ఏళ్ల ఎడమచేతి రిస్ట్ స్పిన్నర్ తన విభిన్నమైన బౌలింగ్ శైలితో బ్యాటర్లను తికమక పెట్టడంలో దిట్ట. ఇతడి బౌలింగ్‌లో గూగ్లీలను, వైవిధ్యాలను కనిపెట్టడం ఏమాత్రం సులువు కాదు. ముఖ్యంగా ఇన్నింగ్స్ మధ్య ఓవర్లలో తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి భారత మిడిలార్డర్ బ్యాటర్లు ఈ స్పిన్నర్ పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2026) టోర్నీలో కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 22 వికెట్లు పడగొట్టి ఇతడు సంచలనం సృష్టించాడు. కేవలం 7.20 ఎకానమీతో పరుగులు నియంత్రిస్తూ వికెట్లు తీయడం ఇతని ప్రత్యేకత.
ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆల్‌రౌండర్..
కేవలం 21 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్ క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు అరాఫత్ మిన్హాస్. ఎడమచేతి వాటం బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు అవసరమైనప్పుడు వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం ఇతని సొంతం. అలాగే బంతితోనూ ఎడమచేతి స్పిన్‌తో పరుగులను అడ్డుకోగలడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే 7 వికెట్లు పడగొట్టి కంగారూలను కట్టడి చేశాడు. ఆ సిరీస్‌లోని ఒక మ్యాచ్‌లో 32 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించగల ఇతని బహుముఖ ప్రజ్ఞ భారత జట్టుకు ఖచ్చితంగా ముప్పే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..