
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘పవర్ స్టార్’ అనే పేరు ఒక బ్రాండ్. ఆయన నడక, నడిచే స్టైల్, మాట్లాడే తీరు.. ఇలా ప్రతి ఒక్కటి అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. ఆయనే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
. అయితే, ఆయన అసలు పేరు పవన్ కల్యాణ్ కాదు అనే విషయం మనలో చాలా మందికి తెలుసు. కానీ, ఆ పేరు ఆయనకు ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలను పవన్ కల్యాణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. "నేను పుట్టినప్పుడు మా ఇంట్లో బారసాల రోజు నాకు పెట్టిన అసలు పేరు 'శ్రీ కల్యాణ్ కుమార్'. కానీ, ఆ తర్వాత స్కూల్ రికార్డుల్లో చేర్చే సమయానికి ఆ 'శ్రీ' అనే పదాన్ని తొలగించి, కేవలం 'కె. కల్యాణ్ కుమార్' అని రిజిస్టర్ చేశారు" అని వెల్లడించారు. గతంలో ఆయన తల్లి అంజనా దేవి కూడా ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు అసలు పేరు కల్యాణ్ కుమార్ అని స్పష్టం చేశారు.
మరి కల్యాణ్ కుమార్ కాస్తా 'పవన్ కల్యాణ్' ఎలా అయ్యారనే దానికి ఆయన ఒక పవర్ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ చెప్పారు. "నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే విపరీతమైన పిచ్చి, ఆసక్తి ఉండేది. ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో నేను నమ్మశక్యం కాని కఠినమైన విన్యాసాలు చేసేవాడిని. నా ఛాతీపై వందల కిలోల బరువున్న బండరాళ్లను పెట్టుకుని, వాటిని సుత్తితో పగలగొట్టించేవాడిని. నా శారీరక దృఢత్వాన్ని, నాకున్న అంకితభావాన్ని చూసి.. నా మార్షల్ ఆర్ట్స్ గురువు నా పేరుకు ముందు 'పవన్' అనే పదాన్ని చేర్చారు" అని తెలిపారు. అలా గురువు ఇచ్చిన 'పవన్' అనే పేరును ఆయన స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్నారు. అదే పేరు కాలక్రమేణా టాలీవుడ్లో ఒక పెను తుపాను సృష్టించింది. ఆ తర్వాత అభిమానులు ఆయనకు ఇచ్చిన 'పవర్ స్టార్' అనే బిరుదు ఆయన పర్సనాలిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. కేవలం నటుడిగానే కాకుండా రైటర్, సింగర్, స్టంట్ డిజైనర్, డైరెక్టర్.. ఇలా మల్టీ టాలెంటెడ్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో బిజీగా ఉన్నారు. తన పేరు వెనుక ఉన్న ఈ రియల్ స్టోరీని పవన్ బయటపెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.