
మార్కెట్ నుంచి తెచ్చిన నిమ్మకాయలు కొన్ని రోజుల్లోనే ఎండిపోవడం సాధారణం. దీంతో చాలామంది వాటిని పనికిరావని భావించి చెత్తలో పడేస్తుంటారు. అయితే ఎండిన నిమ్మకాయలు కూడా ఇంటి పనుల్లో ఎంతో ఉపయోగపడతాయి
.
ఇంటర్నెట్ డెస్క్: నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్-సి సమృద్ధిగా ఉండే ఈ నిమ్మకాయలను పానీయాలు, వంటకాలు, ఊరగాయలు తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అందుకే చాలామంది ఒకేసారి ఎక్కువ నిమ్మకాయలు కొనుగోలు చేస్తుంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత అవి ఎండిపోవడంతో పనికిరావని భావించి చెత్తలో పడేస్తారు. కానీ ఎండిన నిమ్మకాయలు కూడా అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
ఎండిన నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి సింక్పై రుద్దితే సహజ క్లీనర్లా పనిచేస్తుంది. సింక్లో పేరుకుపోయిన మురికి, బ్యాక్టీరియా, దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయ ఎండిపోయినా దాని సువాసన కొంతవరకు ఉంటుంది. ఎండిన నిమ్మకాయ ముక్కలపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి ఫ్రిజ్, షూ ర్యాక్ లేదా అల్మారాలో ఉంచితే దుర్వాసన తగ్గుతుంది.
ఇత్తడి, రాగి, స్టీల్ పాత్రలపై ఉన్న మరకలను తొలగించడానికి ఎండిన నిమ్మకాయ ఉపయోగపడుతుంది. పాత్రపై కొద్దిగా ఉప్పు చల్లి, నిమ్మకాయ ముక్కతో రుద్దితే మరకలు తొలగి పాత్రలు మెరిసిపోతాయి.
చీమలు, కొన్ని కీటకాలకు నిమ్మ వాసన నచ్చదు. ఎండిన నిమ్మకాయ ముక్కలను వంటగది మూలల్లో ఉంచితే కీటకాలు ఆహారం దగ్గరకు రాకుండా సహాయపడుతుంది.
ఎండిన నిమ్మకాయలతో హెర్బల్ టీ కూడా తయారు చేసుకోవచ్చు. ముందుగా నిమ్మకాయలను కొన్ని గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ నీటిని ఉదయం బాగా మరిగించి, కొద్దిగా తేనె కలిపి తాగవచ్చు.
ఎండిన నిమ్మకాయల్లో తాజా నిమ్మకాయలతో పోలిస్తే రసం తక్కువగా ఉన్నప్పటికీ, వాటిలోని సహజ ఆమ్లాలు, సువాసన కొన్ని గృహ అవసరాలకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇకపై ఎండిపోయిన నిమ్మకాయలను వెంటనే పారేయకుండా ఈ చిట్కాలను ప్రయత్నించండి.
విండ్ చైమ్.. ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి
ఫిట్నెస్ కోసం భోజనం మానేస్తున్నారా? జాగ్రత్త..