
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Development: 'కేసీఆర్, కిషన్ రెడ్డి మీ అవినీతి, అహంకారంతో తెలంగాణ ప్రజలకు నష్టం చేయకండి. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు. నేను ప్రధానిని కలిస్తే కిషన్ రెడ్డి ప్రధానిని కలుస్తాడు. నేను కేంద్ర మంత్రిని కలిస్తే ఆయన కేంద్ర మంత్రిని కలుస్తాడు. తెలంగాణకు నిధులు రాకుండా, అభివృద్ధి జరగకుండా కాళ్లలో కట్టెలు పెడుతుండు' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇలాగే చేస్తే మీకు తెలంగాణలో పుట్టగతులు లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారు. మళ్లీ మీరు ఢిల్లీకి పోకుండా చేస్తారు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మియాపూర్‌లో జరిగిన బహిరంగసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ ఈ ఆరు నగరాలే దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. ఒక పద్దతి ప్రకారం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికే మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాం. విస్తరిస్తున్న నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూడు కార్పొరేషన్లు చేశాం. పోలీస్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా సరిహద్దులు నిర్ణయించాం. జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఎందుకు నిధులు అడగడం లేదు? పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 'చేవెళ్ల, మెదక్, మల్కాజిగిరి ఎంపీలు బీజేపీ వాళ్లే ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని ఎందుకు నిధులు అడగడం లేదు తెలంగాణ అభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్చకు సిద్ధం 'మోదీ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అంటున్నారు. ఇక్కడ మూసీని అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు. బీజేపీ ఎంపీలకు రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత లేదా?' అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పదేళ్ల కెసీఆర్ పాలన , పన్నెండేళ్ల మోదీ పాలన, 30 నెలల మా పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఎవరేం చేశారో, ఎన్ని నిధులు తెచ్చారో చర్చిద్దాం రండి అంటూ సవాల్ చేశారు. 'త్వరలో గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ నిర్మించబోతున్నాం. మూడు నెలల్లో ఇందుకు సంబంధించిన పనులను మొదలు పెట్టుకుందాం. విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.. దీనికి అనుగుణంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. అందుకే మెట్రో రెండో దశ విస్తరణ చేపడుతున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. మహానగరంలో లక్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను కట్టి పేదల కష్టాలు తీరుస్తామని.. ఎక్కడ ఉన్న వారికి అక్కడే ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇండ్లు నిర్మాణానికి ప్రణాళికలు 'ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి విడిపించి అక్కడ పేదలకు ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్‌ను అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి ద్వారా 150 స్టాల్స్‌ను మహిళలకు అందించాం. మహిళలను పెట్రోల్ బంక్‌లకు యజమానులను చేశాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.