
కుప్పం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పంలో బంగారు
గనుల అభివృద్ధి అవకాశాలను పరిశీలిస్తామని, టీటీడీ నిధులతో ఆలయాల అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుతో పాటు సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
చిత్తూరు: కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్‌ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని, ప్రస్తుతం వివాదాల్లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
టీటీడీ నిధులతో రూ.34 కోట్ల వ్యయంతో కుప్పంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. కుప్పం అభివృద్ధిపై గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శించారు. కుప్పానికి నీళ్లు తీసుకొచ్చామని సినిమా సెట్టింగులు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. కుప్పానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కొత్త అనుభూతి కలిగేలా ఎలిఫెంట్ సఫారీ, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కుప్పం సమగ్ర అభివృద్ధి కోసం సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు.
ఈ క్రమంలోనే రాజకీయాలపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల విషయంలో తాను ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటానని, అయితే సంఘ విద్రోహ శక్తుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. సీమ ఫ్యాక్షనిజంపై సినిమాలు తీసే రోజులు పోయాయని, ఇప్పుడు రాయలసీమలో పరిస్థితులు పూర్తిగా మారాయని అన్నారు. మరో రెండేళ్లలో తన రాజకీయ జీవితం 50 ఏళ్లు పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో రౌడీలు రాజకీయాల్లోకి రావడం వల్లే అనేక దుర్ఘటనలు జరిగాయని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి వంటి ఘటనలకు, తనను బాధ్యుడిగా చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అలాగే, మాస్క్ అడిగిన డాక్టరును చనిపోయేలా చేశారని.. డ్రైవరును కారు డిక్కిలో పెట్టి డోర్ డెలివరీ చేశారని.. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాజధాని అంశంపై కూడా సీఎం స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత రాజధానిని మార్చడం సాధ్యం కాదని అన్నారు. అమరావతికి బదులుగా కొత్త పేర్లతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. అమరావతి అభివృద్ధినే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్