Adilabad Fake Baba House Seized : గుప్తనిధుల పేరుతో అమాయక ప్రజలను బురిడీ కొట్టించి.. కోటి రూపాయలు వసూలు చేసిన ఒక కిలాడీ నకిలీ బాబాకు న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది.
ప్రజలను మోసం చేయగా వచ్చిన అక్రమ సొమ్ముతో సదరు నిందితుడు విలాసవంతంగా నిర్మించుకున్న నూతన గృహాన్ని పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో చోటుచేసుకున్న ఈ అనూహ్య చట్టపరమైన చర్య స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.అసలేం జరిగిందంటే..?జైనథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శ్రావణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పిప్పల్‌కోటి గ్రామానికి చెందిన దర్శనాల రాజ్‌కుమార్ అలియాస్ రాజు అనే వ్యక్తి తక్కువ కాలంలోనే బాబా అవతారమెత్తాడు. పూజలు చేస్తే గుప్తనిధులు తవ్వి ఇస్తానని, రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తానని నమ్మబలికి అమాయకులను తన మాయమాటలతో బుట్టలో వేసుకున్నాడు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 మంది బాధితుల నుంచి ఏకంగా రూ.1,03,80,000 (కోటి మూడు లక్షల ఎనభై వేలు) వసూలు చేసినట్లు పోలీసుల పక్కా దర్యాప్తులో తేలింది. ఈ దందాపై ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో బాధితులు తిరగబడటంతో భీంపూర్, మావల, నేరడిగొండ, బోథ్, ఆదిలాబాద్ గ్రామీణం, జైనథ్ వంటి వివిధ పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై మొత్తం 19 కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి రాజ్‌కుమార్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఏడుగురిని అప్పట్లోనే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.మోసపు సొమ్ముతో నయా ఇల్లు.. కోర్టు ఆదేశాలతో సీజ్!బాధితులను బురిడీ కొట్టించి.. వసూలు చేసిన కోటి రూపాయల సొమ్ములో భారీ మొత్తాన్ని వెచ్చించి నిందితుడు రాజ్‌కుమార్ పిప్పల్‌కోటి గ్రామంలో ఒక సరికొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే నిందితుడు నేరపూరిత మార్గాల ద్వారా ఆర్జించిన డబ్బుతోనే ఈ ఆస్తిని కూడబెట్టాడని విచారణ అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులు పక్కా డాక్యుమెంట్లతో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం.. నిందితుడి ఇల్లును జప్తు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసు అధికారులు సదరు నిందితుని నూతన ఇంటిని సీజ్ చేసి.. అధికారికంగా తాళం వేసి ముద్రలు వేశారు.మోసపోకండి.. పోలీసులను ఆశ్రయించండి!ఇలా అక్రమంగా సంపాదించే ఎలాంటి ఆస్తులనైనా చట్టప్రకారం వదిలి పెట్టే ప్రసక్తే లేదని.. భవిష్యత్తులోనూ ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని సీఐ శ్రావణ్ స్పష్టం చేశారు. గుప్తనిధులు, చేతబడులు, తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలు చెప్పే నకిలీ బాబాలను ఎవరూ నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. ఈ ముఠా చేతిలో ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే.. ధైర్యంగా వచ్చి పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని వెల్లడించారు.