ఇంటర్నెట్‌డెస్క్: తాను ఖాళీ సమయాల్లో ఎక్కువగా వార్తాపత్రికలే చదువుతానని, అందులోనూ తన గురించి వచ్చిన కథనాలే చూస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్లడించారు.
‘స్టోరీ టైమ్ విత్ సెకండ్ లేడీ’ పేరిట అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా వాన్స్ హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన ‘ప్రెసిడెంట్స్ ప్లే!’ పుస్తకాన్ని చదివి వినిపించారు. అందులో ప్రస్తావించిన మాజీ అధ్యక్షుల ఆసక్తుల గురించి పేర్కొన్నారు. వైట్‌హౌస్ ప్రాంగణంలో నిర్మిస్తోన్న బాల్రూమ్ గురించి మాట్లాడారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4) సందర్భంగా ఈ పాడ్‌కాస్ట్ వీడియోను ఉష ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
ఈ ‘ప్రెసిడెంట్స్ ప్లే!’ పుస్తకంలో ఒక అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో సూపర్‌బౌల్ (ఏటా జరిగే ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్) లైవ్ చూసిన ఫొటోను పొందుపర్చారు. ఆ దృశ్యాన్ని ట్రంప్ ఈ పాడ్‌కాస్ట్‌లో చూపిస్తూ.. ‘‘ఇది చూస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. పుట్‌బాల్ చూసేందుకు బరాక్ ఒబామా, జో బైడెన్, బుష్ కుటుంబాలను ఆహ్వానిస్తే బాగుంటుందేమో. ప్రెసిడెంట్స్ రీయూనియన్ మాదిరిగా ఉంటుంది. అదే జరిగితే ప్రెస్ హోరెత్తుతుందేమో’’ అని సరదాగా అన్నారు. అమెరికాకు అధ్యక్షులుగా పనిచేసిన వారు ఖాళీ సమయంలో ఏమి చేసేవారో ట్రంప్ వెల్లడించారు. ‘‘మామూలుగా ఒక అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో గడిపే సమయం చాలా తక్కువ. ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి అక్కడ ఉండటం ఒక గౌరవం. బిల్‌క్లింటన్ తన కోసం నిర్మించిన ట్రాక్‌పై జాగింగ్ చేసేవారు. ఈ విషయం నాకు ఇటీవలే తెలిసింది. నేనైతే అలా చేయలేను అనుకుంటా. క్లింటన్ మంచి మనిషి. ఆయనంటే నాకు ఇష్టమే’’ అంటూ కొనియాడారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.