ఈ రోజుల్లో గుండెపోటు కేసులు ముప్పుగా మారాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక, మహిళల్లో కూడా గుండెపోటు కేసులు ఎక్కువైపోతున్నాయి.
అయితే, లేటెస్ట్ స్టడీ మహిళల గుండె ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామం ఏంటో తెలిపింది. స్ట్రెంత్ ట్రైనింగ్ మహిళల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ తియాన్యుజ్ జాంగ్ (Dr. Tianyue Zhang) నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. మధ్యవయస్సు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలపై స్ట్రెంత్ ట్రైనింగ్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలో దాదాపు 1,17,000 మందికి పైగా మహిళల ఆరోగ్య డేటాను పరిశీలించి ఈ విషయాల్ని వెల్లడించారు.అధ్యయనం ఏం చెబుతోంది? 20 శాతం తగ్గిన ముప్పు: వారానికి కనీసం రెండు గంటల పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చేసే మహిళల్లో ఎలాంటి వ్యాయామాలు చేయని వారితో పోలీస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం 20 శాతం తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గింది. కార్డియో + స్ట్రెంత్ ట్రైనింగ్ = సూపర్: కేవలం వాకింగ్ లేదా సైక్లింగ్ మాత్రమే కాకుండా వారానికి 150 నిమిషాల కార్డియోతో పాటు రెండు గంటల స్ట్రెంత్ ట్రైనింగ్ కలిపి చేసిన మహిళల్లో గుండెపోటు ముప్పు 45 శాతం వరకు తగ్గింది. ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరం: వ్యాయామాలు చేయడంతో పాటు ఎక్కువ టైమ్ టీవీ చూస్తూ ఒకే చోట కూర్చోవడాన్ని తగ్గించిని మహిళల్లో గుండె ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.అసలు స్ట్రెంత్ ట్రైనింగ్ గుండెకు ఎలా మేలు చేస్తుంది? ఇది కేవలం కండరాల్ని స్ట్రాంగ్‌గా మార్చడమే కాదు.. గుండె జబ్బులకు కారణమయ్యే ప్రధాన సమస్యలపై పోరాడుతుంది. శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అంటే షుగర్ వ్యాధి రాకుండా చూడటంలో సాయపడుతుంది. బరువును కంట్రోల్లో ఉంచి శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగించడంలో సాయపడుతుంది. హై బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిల్ని ఆరోగ్యకరమైన స్థాయిల్లో ఉంచుతుంది. గమనిక: స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల గుండెపోటు ముప్పు బాగా తగ్గినప్పటికీ.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పుపై దీని ప్రభావం కొద్దిగా తక్కువగానే ఉందని శాస్త్రవేత్తలు గమనించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.మహిళల కోసం ముఖ్యమైన చిట్కాలు ఇంట్లోనే చేసుకోదగ్గ స్ట్రెంత్ ట్రైనింగ్ వ్యాయామాలు బాడీవెయిట్ వ్యాయామాలు: స్క్వాట్స్ (Squats), లంజెస్ (Lunges), పుష్-అప్స్. రెసిస్టెన్స్ బ్యాండ్స్: ఇవి మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. వీటితో చేతులు, కాళ్ల కండరాలకు వ్యాయామం ఇవ్వొచ్చు. చిన్న డంబెల్స్: 1 లేదా 2 కేజీల డంబెల్స్‌తో బైసెప్ కర్ల్స్, షోల్డర్ ప్రెస్ వంటివి చేయవచ్చు.ఏ వయసు వారు చేయొచ్చు? చాలామంది మహిళలు వయసు పైబడిన తర్వాత బరువులు ఎత్తకూడదని అనుకుంటారు. కానీ, వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కాబట్టి 40, 50 ఏళ్లు దాటిన మహిళలు కూడా నిపుణుల సమక్షంలో దీనిని ప్రారంభించవచ్చు.వారానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? వారానికి 2-3 రోజులు: రోజు మార్చి రోజు.. కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. మిగతా రోజుల్లో: రోజుకు 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), స్విమ్మింగ్ లేదా సైక్లింగ్ చేయడం మంచిది. యాక్టివ్‌గా ఉండండి: ఆఫీస్ పనుల్లో లేదా ఇంట్లో గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి కాసేపు అటు ఇటు నడవండి. చివరగా: యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ హర్లాన్ ఎమ్. క్రుమ్హోల్జ్ అన్నట్లుగా.. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ప్రతి మహిళ తన దినచర్యలో స్ట్రెంత్ ట్రైనింగ్‌ను ఒక భాగంగా మార్చుకోవడం ఎంతైనా అవసరం.