
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
VIPs Tirumala Darshan: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడం.. మంచి రోజులు ఉండడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో తిరుమలలో సందడి నెలకొంది. గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీనివాసుడిని ప్రత్యేక దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.
శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతోపాటు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కూడా వచ్చారు. వీరిద్దరూ వేర్వేరుగా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వారు ఆలయ సంప్రదాయాల ప్రకారం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల వేంకటేశ్వర స్వామివారిని సినీ, రాజకీయ ప్రముఖులు కూడా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ నటుడు సుమన్ స్వామిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం పలువురు ప్రముఖులు ఆలయ వెలుపల మీడియాతో స్వల్పంగా మాట్లాడి, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.