
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Karimnagar News: తెలంగాణలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు.. నేత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ నగరంలోని కొత్తపల్లిలో ఘనంగా నిర్వహించిన చేనేత పారిశ్రామిక, సహకార సంఘం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలక వర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించి.. ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్ పాలనలోనే చేనేతకు మంచి రోజులు.. సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల కష్టాలను గుర్తించి.. వారిని అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం BRS మాత్రమేనని కొనియాడారు. గతంలో ఉపాధి లేక సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేత కార్మికులకు నూతన జీవం పోశామని ఈ సమయంలో గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పండుగల సందర్భంగా.. పంపిణీ చేసే బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను స్థానిక నేత కార్మికులకే అప్పగించి.. కేసీఆర్ ప్రభుత్వం వారి ఇళ్లలో కాంతులు నింపిందని ఆయన తెలిపారు. దీని ద్వారా వేలాది మంది కార్మికులకు నిరంతర ఉపాధి లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్మికుల పొట్టకొడుతున్నారు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక నేత కార్మికులను కాదని.. వస్త్రాల తయారీ టెండర్లను ఇతర రాష్ట్రాల సంస్థలకు అప్పగించడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల స్థానిక చేనేత కార్మికుల కడుపు కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్లు లేక.. ఉపాధి కరువై చేనేత కార్మికులు మళ్లీ రోడ్డున పడే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. చేనేత కార్మికులు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తిరిగి BRS ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్లీ పాత వైభవాన్ని తీసుకొస్తామని.. చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చి .. కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.