
అయోధ్య రామాలయం విరాళాల కుంభకోణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆలయ నిర్మాణానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వినియోగించిన భూమిలో కొంత భాగం...
అయోధ్య విరాళాల కుంభకోణం నేపథ్యంలో వెలుగులోకి
రామాలయం నిర్మాణం కోసం హనుమాన్ గఢి మహంత్ నుంచి
రూ.23.61 కోట్లతో 1.59 ఎకరాల భూమి కొన్న ట్రస్టు
ఆ భూమి ప్రభుత్వానిదని అంతకుముందే ప్రకటించిన జిల్లా కలెక్టరు
అది తరతరాలుగా హనుమాన్ గఢి భూమేనంటూ మహంత్ న్యాయపోరాటం
కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. అయోధ్య కేసు సీబీఐకి అప్పగించే అవకాశం
న్యూఢిల్లీ/లఖ్‌నవూ, జూలై 2: అయోధ్య రామాలయం విరాళాల కుంభకోణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆలయ నిర్మాణానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వినియోగించిన భూమిలో కొంత భాగం ప్రభుత్వానిదేనని, ఆ భూమిని ఓ ప్రైవేటు వ్యక్తికి రూ.23.61 కోట్లు ఇచ్చి మరీ ట్రస్టు కొన్నట్లుగా తాజాగా వెల్లడైంది. ఈ వివాదాస్పద భూమి మొత్తం 1.59 ఎకరాలు. 2024 జనవరిలో అయోధ్య జిల్లా కలెక్టరు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. అంటే, ప్రభుత్వ అనుమతితోనే ఈ భూమిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయటంగానీ, లీజుకు తీసుకోవటంగానీ జరగాలి. కానీ, దీనికి విరుద్ధంగా అదే ఏడాది ఏప్రిల్‌లో రామజన్మభూమి ట్రస్టు.. రూ.23.61 కోట్లతో మహంత్ మురళీదాస్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. అయోధ్యలోనే ఉన్న హనుమాన్‌గఢి ఆలయం పూజారి మురళీదాస్. ఇదే ఒక విచిత్రం అనుకుంటే.. ఈ వ్యవహారం వెనుక మరిన్ని చిత్రవిచిత్రాలు ఉన్నట్లు తాజాగా బయటపడ్డాయి. సదరు 1.59 ఎకరాల భూమి తనదేనని, తన పేరు మీద 1984 నుంచి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉందని మురళీదాస్ చెబుతున్నారు. 1737లో అవధ్ నవాబు ఈ భూమిని హనుమాన్‌గఢీకి కేటాయించారని, తరతరాలుగా అది ఆలయ ప్రధాన పూజారి పేరు మీద కొనసాగుతూ వస్తోందని పేర్కొన్నారు. కాగా, రామాలయ నిర్మాణం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో 2023 జూన్‌లో.. 1.59 ఎకరాల భూమి రికార్డుల నుంచి మురళీదాస్ పేరును తొలగిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని మురళీదాస్ ఉత్తరప్రదేశ్ రెవెన్యూబోర్డు ఎదుట సవాల్ చేశారు. ఈ కేసు విచారణలో జిల్లా కలెక్టరు తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గతంలో హనుమాన్‌గఢీ ఆలయంలో పూజారులుగా పని చేసిన వారి పేర్లను పొరపాటున భూమి రికార్డుల్లో నమోదు చేశారని, ప్రస్తుత పూజారి మురళీదాస్ పేరును చేర్చటానికి కూడా నిబంధనలు అంగీకరించవని, అందుకే కొట్టేశామని, అది ప్రభుత్వ భూమి అని పేర్కొన్నారు. యూపీ రెవెన్యూబోర్డు కూడా అదనపు కలెక్టరు ఉత్తర్వులనే సమర్థించింది. ఇంత జరిగాక.. మళ్లీ అదే కలెక్టరు సభ్యుడిగా ఉన్న రామజన్మభూమి ట్రస్టు రూ.23.61 కోట్లు చెల్లించి ఆ భూమిని మురళీదాస్ నుంచి కొనుగోలు చేయటమే ఇప్పుడు సంచలనం రేపుతోంది.
విరాళాల కుంభకోణం కేసు దర్యాప్తును కేంద్ర సంస్థలకు అప్పగించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, సీబీఐ రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం యూపీ సిట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 8 మంది ఆలయ సిబ్బందిని అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు వారణాసిలోని ‘సైనిక్ సెక్యూరిటీ సర్వీసెస్’ అనే ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఉద్యోగులు. విరాళాలుగా వచ్చే నగదును లెక్కించే కౌంటింగ్ కేంద్రాల వద్ద వీరిని నియమించారు. విరాళాల సొమ్మును దిగమింగిన నిందితులు భారీగా స్థిర, చరాస్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సిట్ తనిఖీల్లో అయోధ్యలోని ఓ యోగా కేంద్రంలో ‘రామరాజ్య కోశ్’ పేరిట పేటీఎం క్యూఆర్ కోడ్ ఉన్న విరాళాల పెట్టె దొరికింది. నిందితుల్లో ఒకడైన అవినాశ్ శుక్లా పదేళ్లుగా ఈ యోగా కేంద్రంలోనే నివసిస్తున్నాడు. మరోవైపు, విరాళాల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లవకుశ్మిశ్రా.. అయోధ్యలో నిర్మిస్తున్న మూడంతస్తుల ఇంటికి సంబంధించి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణఇవ్వకపోతే ఆ ఇంటిని బుల్డోజర్తో కూల్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
రామజన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన చంపత్ రాయ్‌కు ఉచ్చు బిగుస్తోంది. తన మీద పడ్డ కళంకంతో పదవిలో కొనసాగలేనని, అయోధ్యలో తన సేవ ఇక ముగిసిందని గురువారం ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీన ట్రస్టు సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనుంది. ట్రస్టీలందరిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని న్యాయవాదులు గురువారం అయోధ్యలో భారీగా ఆందోళనకు దిగారు. నిందితుల తరఫున ఎవరూ వాదించరాదని, ఎవరైనా వాదిస్తే రూ.5లక్షలు జరిమానా విధిస్తామని బార్ హెచ్చరించింది. అయోధ్యలోని రామ్‌కోటి రామ్నివాస్ ఆలయ పంచ్ కమిటీ అధిపతి హరిశంకర్ సఫారీవాలా, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ గురువారం విలేకరులతో మాట్లాడారు. చంపత్‌రాయ్‌పై సఫారీవాలా భూకబ్జా ఆరోపణలు చేశారు. రామ్ నివాస్ ఆలయాన్ని రూ.5.80 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఫోర్జరీ పత్రాలతో ఒప్పందం చేసుకున్నారని.. ఆలయ కమిటీ నియమించిన అర్చకుడికి, ఆయన బంధువులకు బ్యాంకుల ద్వారా రూ.60 లక్షలు చెల్లించారని తెలిపారు.
అయోధ్య రామాలయ నిర్మాణం పేరుతో బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచవాన్, వీహెచ్‌పీ నేత గోపాల్జీ, ఆయన అనుచరుడు సతీశ్ నౌబాడే.. కాంట్రాక్టర్ల నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించి.. ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారని కర్ణాటకలోని కలబురగిగి చెందిన దీపక్ పాటిల్ అనే సామాజిక కార్యకర్త యూపీ సిట్‌కు ఫిర్యాదు చేశారు.
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది