
Aamir Khan Gauri Wedding Date: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (61) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు.
గత కొన్ని నెలలుగా రిలేషన్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 'ప్రీతమ్ అండ్ పెడ్రో' సినిమా ప్రదర్శన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమిర్ తన మూడో పెళ్లి వార్తను స్వయంగా ధ్రువీకరించారు.
జూలై 5 తమ జీవితాల్లో ఎంతో ప్రత్యేకమైన రోజు కానుందని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. "అవును, జూలై 5న నా పెళ్లి జరగబోతోంది. ఇది ఇంట్లోనే చాలా సాదాసీదాగా, సన్నిహితంగా జరుపుకుంటున్న వేడుక. కేవలం మా కుటుంబ సభ్యులు, కొద్దిమంది చిన్ననాటి స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారు. మా కొత్త ప్రయాణం అద్భుతంగా సాగాలని, మీ అందరి ఆశీస్సులు మాకు అందించాలని కోరుకుంటున్నాను" అని ఆమిర్ అన్నారు.
అయితే ఇది ఆమిర్ ఖాన్‌కు మూడవ వివాహం కావడం గమనార్హం. ఆమిర్ మొదటగా 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో ఈ దంపతులు విడిపోయారు.
బాలీవుడ్ నిర్మాత కిరణ్ రావును నటుడు ఆమిర్ ఖాన్ 2005లో పెళ్లాడాడు. 16 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఆజాద్‌ను పెంచుతున్నారు.
ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ జంట సుమారు 25 ఏళ్ల క్రితమే మొదటగా కలుసుకున్నారట. అయితే ఆ మధ్య వారిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చినా.. మళ్లీ వీరిద్దరూ కలిసిపోయారని తెలుస్తోంది. అయితే తన 60వ పుట్టినరోజున నాడు ఆమిర్ తన కొత్త ప్రియురాలు గౌరీని పరిచయం చేయగా.. ఇప్పటికే ఆమెకు ఓ కుమారుడు ఉండడం గమనార్హం.
ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ తన కాబోయే భార్యపై ప్రశంసలు కురిపించారు. "గౌరీ నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఆమె చాలా గొప్పది, ఆమెతో ఉంటే నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నా మాజీ భార్యలు కిరణ్, రీనాలతో బంధం ఎంతో గాఢంగా ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల అవి నిలబడలేదు. కానీ ఇప్పుడు గౌరీతో నేను పూర్తి పరిపూర్ణంగా మారుతానని అనిపిస్తుంది. మేమిద్దరం కలిసి చాలా సంతోషంగా ఉన్నాం" అని ఆమిర్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.