
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సింధు జలాల ఒప్పందంపై గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గతేడాది ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నదుల నీటిని పంచుకునే ఈ ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా...
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సింధు జలాల ఒప్పందంపై గత కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నదుల నీటిని పంచుకునే ఈ ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ.. ఇరు దేశాల పరస్పర అంగీకారం లేకుండా ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం గానీ.. మార్పులు చేయడం గానీ సాధ్యం కాదని.. కాబట్టి భారత్ తీసుకున్న నిర్ణయానికి విలువ లేదని వాదిస్తోంది. మరోవైపు తాము తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని.. ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింద. ఈ నేపథ్యంలో అసలు అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.66 ఏళ్ల క్రితం.. అంటే 1960 సెప్టెంబర్ 19న కరాచీలో వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంతో నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ఈ చారిత్రాత్మక సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. మొత్తం 6 నదులను ఇరు దేశాల మధ్య విభజించారు. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదులపై నియంత్రణను పాకిస్థాన్‌కు.. తూర్పు నదులైన సట్లేజ్, బియాస్, రావి నదుల హక్కులను ఇండియాకు కేటాయించారు. దీని ప్రకారం మొత్తం నీటి ప్రవాహంలో దాదాపు 20 శాతం వాటా భారత్‌కు, 80 శాతం వాటా పాకిస్థాన్‌కు దక్కింది.అయితే ఈ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు పరస్పరం అంగీకరించి ప్రత్యామ్నాయ ఒప్పందాన్ని కుదుర్చుకునే వరకు ఈ చట్టం అమలులోనే ఉంటుంది. అంటే ఇందులో ఏకపక్షంగా ఒప్పందం నుంచి తప్పుకునేందుకు ఎటువంటి నిబంధన లేదు. కాకపోతే అంతర్జాతీయ ఒప్పందాల చట్టానికి సంబంధించిన వియన్నా కన్వెన్షన్‌లోని రెండు ఆర్టికల్స్ ఇక్కడ భారత్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆర్టికల్ 60: ఏదైనా ఓ పక్షం ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తే దానికి ప్రతిచర్యగా అవతలి పక్షం ఆ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది.ఆర్టికల్ 62: కాలక్రమేణా పరిస్థితుల్లో ఊహించని, ప్రాథమిక మార్పులు సంభవించినప్పుడు ఆ ఒప్పందం నుంచి పూర్తిగా తప్పుకునేందుకు ఈ ఆర్టికల్ అవకాశం ఇస్తుంది.ప్రస్తుతం సింధు నదీ పరివాహక ప్రాంతంలోని పర్యావరణం 1960 నాటి అంచనాలకు భిన్నంగా ఉంది. హిమానీ నదాలు కరిగిపోవడం, రుతుపవనాల గమనం మారడం, జనాభా ఒత్తిడి పెరగడం వంటి పర్యావరణ, వాతావరణ మార్పులను అప్పట్లో అంచనా వేయలేదు. కాబట్టి భద్రతా కారణాల కంటే వాతావరణ మార్పుల కోణాన్ని బలంగా వినిపిస్తే.. ఆర్టికల్ 62 ప్రకారం ఈ ఒప్పందం నుంచి తప్పుకోవడానికి భారత్‌కు చట్టపరంగా బలమైన అవకాశం లభిస్తుంది.అయినప్పటికీ వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 26 ప్రకారం పెక్టా సుంట్ సర్వాండా అనే అంతర్జాతీయ సూత్రం ఒకటి ఉంది. దీని అర్థం ఒప్పందాలను మంచి ఉద్దేశంతో గౌరవించాలి. దీని ఆధారంగా చేసుకునే హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ 2025, 2026 మే నెలలో ఇచ్చిన తీర్పులలో.. భారత్ ఒప్పందాన్ని నిలిపివేసినప్పటికీ, ప్రస్తుతం నడుస్తున్న చట్టపరమైన విచారణలపై దాని ప్రభావం ఉండదని పేర్కొంది. అయితే భారత్ ఈ విచారణలను బహిష్కరించడమే కాకుండా, కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా చెల్లుబాటు కాబోవని తేల్చి చెప్పింది. ప్రస్తుతం భారత్ కేవలం శాశ్వత సింధు కమిషన్ సమావేశాలను నిర్వహించకపోవడం, హైడ్రోలాజికల్ డేటాను పంచుకోకపోవడం వంటి సహకార నిలిపివేతను మాత్రమే చేస్తోంది, కానీ నదీ ప్రవాహాలను ఇంకా మళ్లించలేదు.