Greyhounds Shifted to Traffic : రాష్ట్రంలోని దండకారణ్యంలో కంటిమీద కునుకు లేకుండా దశాబ్దాల పాటు మావోయిస్టుల అరాచక శక్తులతో పోరాడిన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలైట్ కమాండో ఫోర్స్ ‘గ్రేహౌండ్స్’...
Greyhounds Shifted to Traffic : రాష్ట్రంలోని దండకారణ్యంలో కంటిమీద కునుకు లేకుండా దశాబ్దాల పాటు మావోయిస్టుల అరాచక శక్తులతో పోరాడిన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలైట్ కమాండో ఫోర్స్ ‘గ్రేహౌండ్స్’ భవితవ్యంపై ఇప్పుడు సరికొత్త వివాదం చెలరేగింది. తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపు పూర్తిగా తగ్గిపోవడంతో.. ఈ విభాగాన్ని ఖాళీ చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే చిరుత లాంటి వేగం, కొండలు కోనలను అవలీలగా దాటే సాహస నైపుణ్యాలు కలిగిన ఈ కమాండోలను లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ వంటి సాధారణ విభాగాలకు కేటాయించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ఈ సిబ్బంది సామర్థ్యాన్ని తక్కువ చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు శాఖలోనే అంతర్గతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసాధారణ నైపుణ్యాలు.. సాధారణ విధులు?శరీరంలో అలసట లేకుండా.. వీపుపై 15 కిలోల బరువుతో మైళ్ల దూరం వేగంగా పరిగెత్తగలిగే ఒక గ్రేహౌండ్స్ కమాండోను సిద్ధం చేయడానికి ప్రభుత్వానికి కొన్నేళ్ల కఠిన శిక్షణ, భారీగా నిధులు అవసరం అవుతాయి. అలాంటి గెరిల్లా పోరాట యోధులను అక్టోపస్, ఈగల్, ఇంటెలిజెన్స్ వంటి ప్రత్యేక విభాగాలకు పంపకుండా.. కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రించే విధులకు కేటాయించడం వ్యూహాత్మక లోపమని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కమాండోల అసాధారణ రక్షణ నైపుణ్యాలు పూర్తిగా వృథా అవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.జీతాల తగ్గింపుతో ఆందోళనలో సిబ్బంది!ఈ బదిలీల వల్ల కమాండోలు ఆర్థికంగానూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ విభాగంలో ఉన్న రిస్క్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రెగ్యులర్ వేతనంతో పాటు అదనంగా 60 శాతం ప్రత్యేక అలవెన్స్ అందుతోంది. కానీ ఇప్పుడు వారిని సాధారణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయడం వల్ల ఈ అదనపు రిస్క్ అలవెన్స్ కేవలం 30 శాతానికి పడిపోతుంది. అత్యంత ప్రమాదకరమైన విధుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసిన సిబ్బందికి.. ఒక్కసారిగా పోస్టింగులు మార్చి వేతనాలు తగ్గించడం వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ వేటలో వాడాలనే డిమాండ్!ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద విపత్తు గంజాయి, సింథటిక్ డ్రగ్స్ మాఫియా. విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న ఈ ఆరాచక శక్తులను అరికట్టడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. వీటి కోసం ఏర్పాటు చేసిన ‘ఈగల్’, ‘హెచ్-న్యూ’ విభాగాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గంజాయి సాగు, రవాణా ఎక్కువగా జరిగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ వంటి జిల్లాలకు ప్రతి చోటా 2 నుంచి 3 ప్లటూన్ల చొప్పున గ్రేహౌండ్స్ కమాండోలను రంగంలోకి దించాలని నిపుణులు సూచిస్తున్నారు. అటవీ సరిహద్దుల్లోని స్మగ్లర్ల స్థావరాలపై దాడులు చేయడానికి వీరు సరైన వ్యూహాత్మక ఆయుధాలని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కోరుతున్నారు.