
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
National Doctors Day 2026: తమ నైపుణ్యం ద్వారా ప్రతి రోజూ వేల ప్రాణాలను డాక్టర్లు కాపాడుతున్నారని.. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు' అని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, వారి సేవలు ఆరోగ్య వ్యవస్థకు ఎంతో కీలకమని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్య సౌకర్యాలు, తగిన మానవ వనరులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 440 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, సుమారు 800 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశాం. డాక్టర్లతో పాటు ఇతర పోస్టులను కూడా పెద్ద సంఖ్యలో భర్తీ చేశామని చెప్పారు. సుమారు 15 వేల పోస్టులు భర్తీ చేశాం' అని వివరించారు.
'ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డెంటిస్టుల ఆకాంక్షను నెరవేర్చుతూ 48 డెంటల్ సర్జన్ పోస్టులను భర్తీ చేశాం. ఈ రెండున్నర సంవత్సరాల్లో సుమారు 1,300 మంది డాక్టర్లకు పదోన్నతులు కల్పించాం. డాక్టర్ల దశాబ్ద కాల ఆకాంక్ష ఉస్మానియా నయా హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించాం. గాంధీ వైద్య కళాశాల, ఉస్మానియా వైద్య కళాశాలల్లో నూతన హాస్టళ్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం' అని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
'వైద్యులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందికి మెరుగైన వర్క్ ఎన్విరాన్మెంట్ కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలను 15 శాతం మేర పెంచాం. అద్దె భవనాలు, పాత భవనాల్లో కొనసాగుతున్న మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆధునిక భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం' అని మంత్రి వెల్లడించారు.
భవిష్యత్తులోనూ వైద్యుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యులు తమ సేవలను కొనసాగించాలని కోరారు. డాక్టర్స్ డే సందర్భంగా మరోసారి రాష్ట్రంలోని వైద్యులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.