
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
National Doctors' Day 2026: దేవుడు అందరికీ కనిపించడు. కానీ ఆ దేవుడి ప్రతిరూపం తెల్లకోటు రూపంలో మన కళ్లుముందే తిరుగుతుంది. అది వైద్యుల రూపంలో కనిపిస్తుంది. అందుకే మన పెద్దలు అన్నారు. వైద్యో నారాయణో హరి అని. నేడు జులై 1వ తేదీ. నేషనల్ డాక్టర్ డే. ఈ సందర్భంగా అన్ని ఆసుపత్రులు శుభాకాంక్షాలు, పూలదండలతో రద్దీ కనిపిస్తున్నాయి. కానీ ఆ తెల్లకోటు వెనక ఉన్న స్టెతస్కోప్ వెనుక ఉన్న ఒక సాదా సీదా మనిషి జీవితాన్ని.. వారి త్యాగాలను మనం ఎప్పుడైనా గమనించామా?
కోవిడ్ వంటి మహమ్మారి కాలంలో ప్రపంచమంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇళ్లలోనే దాక్కుంది. కానీ తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగుల కోసం నిలబడ్డారు ఈ వైద్యులు. ఆ సమయం ఎంతోమంది వైద్యులు తమ కుటుంబాలకు దూరంగా.. నెలల తరబడి డ్యూటీల్లోనే ఉన్నారు. చివరికి కొంతమంది వైద్యులు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఆ తెల్లటి కోటు కేవలం ఒక వృత్తికి సంబంధించిన దుస్తువులు కావని.. అవి ఒక నిరంతర త్యాగానికి చిహ్నమని మనం గర్వంగా చెప్పాలి. ఒక డాక్టర్ జీవితంలో సంతోషాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. అర్ధరాత్రి 12గంటలకు ఫోన్ వచ్చినా.. ఇంట్లో పండగ ఉన్నా.. ఏ శుభకార్యం జరిగినా.. తన సొంత బిడ్డకు ఆరోగ్యం బాగలేకపోయినా.. ఆసుపత్రిలో ఒక రోగి ఎమర్జెన్సీలో ఉన్నాడంటే పరుగెత్తుకుంటూ వెళ్తుంటారు. అక్కడ కొట్టుకుంటున్న ఒక ప్రాణాన్ని కాపాడేందుకు మించింది ఏదీ ముఖ్యంగా కాదని భావిస్తుంటారు. కానీ వైద్యులు తినే ప్రతి ముద్దలోనూ ప్రశాంతత అస్సలు ఉండదు. నిద్రకు గ్యారెంటే లేదు. ఒక సర్జరీ సక్సెస్ అవ్వాలంటే గంటల తరబడి నిలబడాలి. ఆ సమయంలో వచ్చే వెన్నునొప్పి, అలసట.. ఆ తెల్లకోటు వెనకే దాగిపోతాయి. ఆసుపత్రిలో ఒక రోగి మరణిస్తే.. ఆ రోగి బంధువుల కంటే మానసికంగా ఎక్కువగా కుంగిపోయేది డాక్టర్లే. ఇంకొంచెం ప్రయత్ని ఉంటే బాగుండేదేమో అనే అపరాధ భావన వారిని లోలోపల తలచివేస్తుంటుంది. అయినా కూడా ఆ బాధను ముఖంపై చూపించకుండా వెంటనే మరో బెడ్ పై ఉన్న పేషంటును రక్షించుకునేందుకు నవ్వుతూ వెళ్లాల్సి ఉంటుంది. గుండెలో ఎంత బాధ ఉన్నా రోగికి ధైర్యం చెబుతూనే ముఖంపై చిరునవ్వును అలంకరించుకోవడం ఎంత పెద్ద త్యాగమూ మనం అర్థం చేసుకోవాలి.
వైద్య విద్యలో పెట్టుబడి ఆరోగ్య సంరక్షణను ఎలా మార్చిందో తెలపడానికి కర్నాటకను ఆదర్శంగా తీసుకోవాలి. మణిపాల్ లోని సంస్థలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించాయి. దేశం, ప్రపంచవ్యాప్తంగా రోగులకు సేవ చేసే తరతరాల వైద్యులు తయారు చేశాయి. విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల్లో నిరంతర పెట్టుబడి ద్వారా ఏం సాధించవచ్చో..వారి విజయమే మనకు నిరూపిస్తుంది. ప్రతి పౌరునికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందే విధంగా చూసేందుకు జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేయడం కూడా చాలా ముఖ్యం.
కానీ నేటి సమాజంలో వైద్యులను చూస్తున్న కోణం పూర్తిగా మారుతుందనే చెప్పాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా పరిస్థితి విషమించి రోగి మరణిస్తే ఆసుపత్రులపై దాడులు చేయడం, డాక్టర్లపై చేతులు చేసుకోవడం వంటి ఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాము. రాత్రింబవళ్లు కష్టపడి ప్రాణాలు కాపాడుతున్న చేతులపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఆ తెల్లకోటు రక్తసిక్తమవుతోంది. వారి మనస్సు ముక్కముక్కలు అవుతోంది. డాక్టర్లు ప్రాణాలు పోసి దేవుళ్లే కాదు.. ప్రాణాలు కాపాడేందుకు శాయశక్తుల ప్రయత్నించే మనుషులు మాత్రమేనని సమాజం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరో ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి డాక్టర్ వెనక ఒక త్యాగపూరితమైన ఫ్యామిలీ ఉంటుందన్న విషయాన్ని ఈ సమాజం గుర్తించాలి. భర్త కోసం భార్య.. భార్య కోసం భర్త.. తల్లిదండ్రుల కోసం ఎదురుచూసే కళ్ళు ఆ ఇంట్లో ఉంటాయన్న సంగతి మరిచిపోవద్దు. సమాజం కోసం తమ వారిని త్యాగం చేసిన కుటుంబాలు అవి. అందుకే కేవలం ఒక రోజు శుభాకాంక్షలు చెప్పి వదిలేయడం కాదు.. నిరంతరం శ్రమిస్తూ తమ జీవితాలను త్యాగం చేస్తున్న ప్రతి వైద్యుడికి గౌరవం ఇవ్వాలి. వారిపై నమ్మకం ఉంచాలి. వారిని గౌరవించడం అంటే ఆ తెల్లకోటు వెనక ఉన్న మనిషిని వారి గుండెచప్పుడు అర్థం చేసుకోవాలి. వారికి చేతులెత్తి నమస్కరించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.