
తెలంగాణ బీజేపీలో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న అధిష్ఠానం..
తప్పులు చేస్తున్న, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేతలపై కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ ఆఫీస్ బేరర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతాన్ని విస్మరించి, కేవలం ఆఫీసుల్లో ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
రాష్ట్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎవరి వైఖరి ఎలా ఉంది? అనే విషయాలపై హైకమాండ్ వద్ద పూర్తి చిట్టా ఉందని నితిన్ నబీన్ నేరుగానే హెచ్చరించినట్లు సమాచారం. పదవులు వచ్చే వరకు ఒకలా.. వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్న కొందరు నేతల జాబితా ఇప్పటికే సిద్ధమైందని ఆయన సంకేతాలు ఇచ్చారు. బాధ్యతలు దక్కిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుండా, ప్రజా సమస్యలను గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అధికారంలోకి వచ్చేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని.. అలాంటి సువర్ణావకాశాన్ని కొందరు నేతల వైఖరి వల్ల పాడుచేసుకోలేమని ఆయన గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
గడిచిన ఆరు నెలల కాలంలో ఏ నాయకుడు ఎంతవరకు ప్రజల్లో ఉన్నారు? పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఏ మేరకు విజయవంతం చేశారు? అనే అంశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా ఒక ప్రత్యేక నివేదికను కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఆరు నెలల నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో నేతల పదవుల కొనసాగింపుపై కీలక నిర్ణయాలు ఉంటాయని ఆయన తేల్చిచెప్పారు. ఎవరెవరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు, ఎవరెవరు అంటీముట్టనట్లు ఉంటున్నారనే అంశంపై ఇప్పటికే అధిష్టానం ఒక స్పష్టతకు వచ్చింది. పనితీరు మార్చుకోని పక్షంలో, స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకోవాలని, లేదంటే అధిష్టానమే కఠిన చర్యలు తీసుకుని రాష్ట్ర కమిటీలో భారీ మార్పులు చేర్పులు చేస్తుందని హెచ్చరించారు.
పార్టీలో సొంత అజెండాలు నడుపుతూ, గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్న నేతలపై నితిన్ నబీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలను ఏమాత్రం సహించే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విభేదాలు పక్కనబెట్టి ఉమ్మడిగా పనిచేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని గట్టి సంకేతాలు పంపారు. నియోజకవర్గాల్లో పట్టు పెంచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని, బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించడం ఇప్పుడు టీబీజేపీలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఒకవైపు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన సాధారణ శ్రేణుల్లో తీవ్ర జోష్ నింపినప్పటికీ, మరోవైపు ఆయన చేసిన హెచ్చరికలు పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు, ఆఫీస్ బేరర్లకు ఇబ్బందికరంగా మారాయి. అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నా, కొందరి తీరువల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, అలాంటివాళ్లను దూరం పెట్టక తప్పదని హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. మరి ఇప్పటికైనా ఈ హెచ్చరికలను గుణపాఠంగా తీసుకుని, నితిన్ నబీన్ దిశానిర్దేశాన్ని టీబీజేపీ నేతలు తూచ తప్పకుండా పాటిస్తారా? అంతర్గత విభేదాలను పక్కనబెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసికట్టుగా కృషిచేస్తారా? లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.