
రాజకీయాల్లో శత్రువును దెబ్బతీయాలంటే వారి బలాన్నే బలహీనతగా మార్చాలనే సూత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కాగా వంటబట్టించుకున్నారు.
“ముల్లును ముల్లుతోనే తీయాలి” అనే సామెతను తూచా తప్పకుండా అమలు చేస్తూ, బీజేపీ మార్కు హిందుత్వ రాజకీయాలకు అదే తరహా ఆధ్యాత్మిక బాణంతో సమాధానం ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కేవలం రెండు లోక్‌సభ సీట్ల నుంచి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదిగిన బీజేపీకి ‘హిందుత్వ’ నినాదమే కీలక భూమిక పోషించిందనే విషయం తెలిసిందే. ఉత్తరాదిన మెజారిటీ రాష్ట్రాల్లో ఇదే ఫార్ములాతో అధికారంలోకి వచ్చిన కమలం పార్టీ, ఇప్పుడు దక్షిణాదిపై.. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ అంశం బీజేపీకి ప్రధాన అజెండాగా మారకుండా ఉండేలా, కాంగ్రెస్ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడం లేదనే బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపుతూ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఏకంగా రూ. 360 కోట్ల భారీ వ్యయంతో అత్యంత అధునాతన గోశాలల నిర్మాణానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కేవలం గోరక్షణ ప్రకటనలకే పరిమితం కాకుండా యాదాద్రి, వేములవాడ, మొయినాబాద్‌లలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గోశాలల ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలని భావించడం రేవంత్ రెడ్డి పక్కా రాజకీయ చతురతకు నిదర్శనం. ప్రధాని మోదీ చేతుల మీదుగానే వీటిని ప్రారంభింపజేయడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ చేసే రాజకీయ విమర్శల ముఖాన్ని శాశ్వతంగా మూసివేయవచ్చనేది సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్.
గోసంరక్షణ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడటం లేదని నిరూపించేందుకు మూడు ప్రధాన కేంద్రాల్లో విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొయినాబాద్‌లోని యెనికేపల్లిలో 90 ఎకరాల విస్తీర్ణంలో రూ. 160 కోట్ల భారీ వ్యయంతో అధునాతన గోశాల నిర్మాణం కాబోతోంది. ఇది రాబోయే జనవరి నాటికి పూర్తిస్థాయి నిర్వహణలోకి రానుంది. అదేవిధంగా వేములవాడలో 63 ఎకరాలు, యాదాద్రిలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కొక్కటి రూ. 100 కోట్ల చొప్పున వ్యయం చేస్తూ ఆధునికంగా వీటిని నిర్మిస్తున్నారు. ఇవి వచ్చే మే, జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గోసంరక్షణతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలకు కూడా రేవంత్ సర్కారు సమాంతరంగా ప్రాధాన్యతనిస్తోంది. ములుగులోని సమ్మక్క-సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, బాసర, వేములవాడ సహా దాదాపు 20 ప్రధాన దేవాలయాల అభివృద్ధి పనులను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. యాదాద్రిలో వేద పాఠశాల ఏర్పాటుతో పాటు, రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ చర్యల ద్వారా సనాతన ధర్మ పరిరక్షణలో తాము ఎవరికీ తీసిపోమని కాంగ్రెస్ ఆచరణలో నిరూపిస్తోంది.
ఇటీవల బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా గోవధ జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, హైదరాబాద్‌కు గోవులు తరలకుండా అడ్డుకోగలగడం ఈ వ్యూహంలో భాగమేనని అధికారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం వర్గాల నుంచి కూడా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్న తరుణంలో, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సర్వత్రా సానుకూలతను సంపాదిస్తున్నాయి. మొత్తానికి ‘గోమాతాస్త్రం’ ద్వారా బీజేపీ హిందుత్వ రాజకీయాలకు రేవంత్ రెడ్డి వేసిన పక్కా వ్యూహాత్మక ఎత్తుగడ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.