
అన్నం ఉడికిందో, లేదో చెక్ చేయడానికి ఒక్క మెతుకు పరిశీలిస్తే సరిపోతుంది. అదేవిధంగా తమ రెస్టరంట్ రుచుల ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఒక్క మెత్తటి ఇడ్లీ టేస్ట్ చేస్తే చాలంటున్నారు బీనా గాంధీ.
స్వతహాగానే ఆహార ప్రియురాలైన ఆమెకు పాకశాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది.
అన్నం ఉడికిందో, లేదో చెక్ చేయడానికి ఒక్క మెతుకు పరిశీలిస్తే సరిపోతుంది. అదేవిధంగా తమ రెస్టరంట్ రుచుల ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఒక్క మెత్తటి ఇడ్లీ టేస్ట్ చేస్తే చాలంటున్నారు బీనా గాంధీ. స్వతహాగానే ఆహార ప్రియురాలైన ఆమెకు పాకశాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ ఆసక్తే ఆమెను ఫుడ్ ఆంత్రప్రెన్యూర్‌ని చేసింది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్, ముంబయిల్లో ఇప్పటికే ఆరు అవుట్‌లెట్స్‌ని తెరిచిన ఆమె.. దక్షిణాదిన ప్రాచుర్యం పొందిన టిఫిన్స్, ఇతర వంటకాల్ని ఈ వేదికగా అక్కడి వారికి పరిచయం చేస్తున్నారు. ‘సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలూ దక్షిణాది వంటకాల రుచిని ఆస్వాదించడానికి తరచూ మా రెస్టరంట్లకు వస్తుంటారు..’ అంటోన్న బీనా వ్యాపార ప్రయాణం గురించి తెలుసుకుందాం..
తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టి పెరిగారు బీనా. ఈ ప్రాంతం పేరు వినగానే ఇడ్లీ-సాంబార్, వడ, దోశ.. వంటి రుచికరమైన అల్పాహారాలే గుర్తొస్తాయి. చిన్నతనం నుంచి వీటి రుచిని ఆస్వాదిస్తూ పెరిగారామె. అంతేకాదు.. వాటిని అంతే రుచికరంగా తయారుచేయడమూ నేర్చుకున్నారు. అయితే పెళ్లయ్యాక తన భర్తతో కలిసి ముంబయి వెళ్లిపోయారు బీనా.
‘పెళ్లయ్యాక అమ్మ చేతి వంటను, కోయంబత్తూరు రుచుల్ని చాలా మిస్సయ్యా. అత్తారింట్లో గరిట తిప్పినా నేను చేసిన వంటకాలకు అక్కడి రుచిని తీసుకురాలేకపోయానేమో అనిపించేది. అప్పుడర్థమైంది.. వాటి రుచి బియ్యంలో దాగుందని! దాంతో మా నాన్నకు ఫోన్ చేసి అక్కడి నుంచి బియ్యం తెప్పించుకునేదాన్ని. వాటితోనే సాంబార్ రైస్, రసం రైస్.. వంటి దక్షిణాది ప్రత్యేక వంటకాల్ని తయారుచేసి మా అత్తింటి వారికి పరిచయం చేశా. ఈ రుచులు మా మామగారికి ఎంతో నచ్చాయి. దాంతో అప్పుడప్పుడూ బంధువుల్ని ఇంటికి పిలిచి.. నా చేత దక్షిణాది ప్రత్యేక వంటకాలు తయారుచేయించి వారికి విందిచ్చేవారు. దానికి ‘సౌత్ ఇండియన్ ఫెస్టివల్’ అని పేరు కూడా పెట్టారు. నా చేతి వంట అతిథులకు ఎంతగానో నచ్చేది. వాళ్లిచ్చే ప్రశంసల స్ఫూర్తితోనే ఓరోజు ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది..’ అంటున్నారు బీనా.
ఈ ఆలోచనతోనే మొదట ఇడ్లీ, దోశ పిండి అమ్మడం ప్రారంభించారు బీనా. వీటికి మంచి స్పందన రావడంతో.. తమకు మరిన్ని దక్షిణాది రుచులు కావాలని కొందరు వినియోగదారులు ఆమెను కోరారు. దాంతో సాంబార్, రసం, చట్నీ, పులిహోర.. వంటి వంటకాల్నీ దక్షిణాది రుచులతో వారికి చేసి అందించేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత తన భర్తతో కలిసి అహ్మదాబాద్ వెళ్లి స్థిరపడిన బీనా.. అక్కడే క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయా వేడుకల కోసం దక్షిణాది ప్రత్యేక అల్పాహార వంటకాల్ని తయారుచేసి అందించేవారు. ఇలా ఆమె చేతి రుచులకు క్రమంగా ఆదరణ పెరగడంతో ‘దక్షిణాయన్’ పేరుతో ఓ చిన్న రెస్టరంట్ తెరిచారు బీనా.
‘అహ్మదాబాద్ వాసులకు దక్షిణాది రుచుల్ని చేరువ చేయాలన్న ఆలోచనతోనే దక్షిణాయన్ని ప్రారంభించా. అయితే దక్షిణాది వంటల్లో ప్రావీణ్యం ఉన్న చెఫ్స్ దొరకడం మొదట కాస్త ఇబ్బందే అయింది. దాంతో కొన్నాళ్ల పాటు నేను, నా భర్త ఇద్దరమే వంట, సర్వింగ్.. తదితర బాధ్యతలు చూసుకున్నాం. ఆ తర్వాత నలుగురిని పనిలో చేర్చుకొని వ్యాపారాన్ని కొనసాగించాం..’ అంటోన్న ఈ ఫుడ్ లవర్.. ఆపై ముంబయిలోని వాల్కేశ్వర్‌లో మరో బ్రాంచిని తెరిచారు. ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్‌లలో మూడేసి బ్రాంచీల చొప్పున.. మొత్తం ఆరు అవుట్లెట్స్ల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు బీనా.
సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలూ ముంబయిలోని జుహూలో తెరిచిన తమ రెస్టరంట్‌ను తరచూ సందర్శిస్తుంటారని చెబుతున్నారు బీనా.
‘అలనాటి నటి జీనత్ అమన్ గతంలో ఓసారి జుహూలోని మా రెస్టరంట్‌కు వచ్చారు. ఆమెకు మా వంటకాలు ఎంతగానో నచ్చాయి. దాంతో మా రుచుల్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అది వైరలవడంతో మా ప్రత్యేకతల గురించి మరింత మందికి తెలిసింది. అప్పట్నుంచి ఆమె తరచూ మా రెస్టరంట్‌కు వస్తున్నారు. మా రెస్టరంట్లలో ఎక్కువమంది ఇష్టపడే వంటకాలు ఇడ్లీ-కారం పొడి, రసం-వడ. వీటి కోసం ఉపయోగించే మసాలాల్ని ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేస్తుంటాం. అందుకే వాటికి ఆ రుచి వస్తుంది. అంతేకాదు.. మా రెస్టరంట్లన్నీ దక్షిణాది సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్ చేయించాం. ఇక్కడికొచ్చిన అతిథులకు ఇంట్లో కూర్చొని ఇంటి వంట రుచి చూసిన ఫీలింగ్ కలిగేలా చేయాలన్నదే మా లక్ష్యం..’ అంటోన్న బీనా.. ఇటీవలే ‘దక్షిణాయన్’ పేరుతో ఓ రిటైల్ షాపు కూడా తెరిచారు. ఈ వేదికగా మసాలాలు, కారం పొడులు, చట్నీలు, ఇన్స్టంట్ ఆహార పదార్థాలు.. వంటివి ఆహార ప్రియులకు చేరువ చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.