
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Chandrababu Review: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్‌తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని చెప్పారు. రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మ్యాపింగ్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్కు అవకాశం ఉందని గుర్తుచేశారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు.
బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని చెప్పారు. ఖనిజాల వ్యాల్యూ అడిషన్‌కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్‌పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయనే దానిని గుర్తించాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలని చెప్పారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమని గుర్తుచేశారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని.. మిగతా బ్లాక్స్‌పై కూడా అధ్యయనం చేయాలని గనుల శాఖకు సూచనలు ఇచ్చారు.
రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18 శాతం మేర వృద్ధి నమోదైనట్టు తెలిపారు. గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాపై కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచాలని చెప్పారు. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలతోపాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించడం, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని వివరించారు. ప్రజల కోసమే ఇసుకపై వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని.. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.