
© 2026 nimisham.in


Majji Srinivasa Rao YSRCP : ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందే విజయనగరం వైసీపీలో కీలక మార్పు చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను రాజీనామా చేశారు.
జగన్ కు రాజీనామా లేఖ : విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను సైతం ఆయన వదులుకున్నారు. గతంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా మజ్జి శ్రీనివాసరావు పనిచేశారు. తాను వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు మేనల్లుడైన మజ్జి శ్రీనివాసరావు.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పార్టీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని తెలియజేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా రాజీనామా లేఖ పంపినట్లు సమాచారం.








