
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సదస్సులో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాదాపూర్, న్యూస్‌టుడే: తెలంగాణలో వేగంగా సాగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తితోపాటు పొదుపుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్బ్రీసీఐఐ్శ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘25వ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్‌ 2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.‘స్థిరమైన అభివృద్ధికి ఇంధన సామర్థ్యమే అత్యంత ఆచరణాత్మక మార్గం, తెలంగాణాలో భవిష్యత్తులో విద్యుత్తు అవసరం మరింత పెరుగుతుంది. మెరుగైన మోటార్లు, శీతలీకరణ వ్యవస్థలు, పారిశ్రామిక ప్రక్రియల ద్వారా విద్యుత్తు వృథాను అరికట్టాల్సిన అవసరముంది. ఇంధన ఆడిట్‌ను ఏడాదికి ఒకసారి చేసే తంతులా కాకుండా, నిరంతరం నిర్వహణ ప్రక్రియగా మార్చాలి. పరిశ్రమలు తక్కువ విద్యుత్తును వినియోగిస్తే, వాటి నిర్వహణ వ్యయం సైతం తగ్గుతుంది. ఏఐ వంటి ఆధునిక పరిజ్ఞానంతో విద్యుత్తు వృథాను గుర్తించి, వినియోగాన్ని మరింత సమర్థంగా మార్చుకోవాలి’ అని తెలిపారు. కార్యక్రమంలో ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్‌ ఛైర్మన్‌ తేజ్‌ప్రీత్‌సింగ్‌ చోప్రా, ఎన్‌టీపీసీ ఆపరేషన్, సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌శర్మ, శేషసాయి పేపర్‌ అండ్‌ బోర్డ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గణేశ్, సీఐఐ తెలంగాణ ఛైర్మన్‌ గౌతమ్‌రెడ్డి, మహాలక్ష్మి గ్రూప్‌ ఛైర్మన్‌ వై.హరిశ్చంద్రప్రసాద్, సీఐఐ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నేషనల్‌ ఛైర్మన్‌ సి.శేఖర్‌రెడ్డి, సీఐఐ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





