
ఏపీపీఎస్సీ పరీక్షల ప్రత్యేకం ఇండియన్‌ ఎకానమీ హరిత విప్లవం తర్వాత మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అద్భుతమైన పెరుగుదల నమోదైనప్పటికీ దానికి అనుగుణంగా ఆహార భద్రతలో మాత్రం వృద్ధి కనిపించలేదు. వ్యవసాయంలో వైవిధ్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా రైతుల ఆదాయ స్థాయుల్లో కూడా స్తబ్దత నెలకొంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే రెయిన్‌బో విప్లవం. ఉద్యానవనం, పశుసంవర్థకం, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమ, ఆహార ధాన్యాలు మొదలైన అన్ని రంగాల సంపూర్ణ అభివృద్ధి దీని ముఖ్య ఉద్దేశం. దీని అమలుతో పోషకాహార లభ్యత, ఆహార భద్రత, రైతులకు ఆదాయ భద్రత, సుస్థిర వ్యవసాయం లాంటి ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వ భావన. రెయిన్‌బో విప్లవంలోని కీలకాంశాలు, లక్ష్యాలు మొదలైన అంశాలపై పోటీపరీక్షార్థికి అవగాహన ఉండాలి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించడానికి, ఉత్పాదకతను పెంచడానికి భారతదేశం అనుసరిస్తున్న బహుముఖ విధానమే ‘రెయిన్‌బో విప్లవం’. జాతీయ వ్యవసాయ విధానం-2000లో భాగంగా ప్రభుత్వం 2000, జులై 29న రెయిన్‌బో విప్లవాన్ని ప్రకటించింది. ఇందులో హరిత విప్లవం (ఆహార ధాన్యాలు), శ్వేతవిప్లవం (పాడి పరిశ్రమ), పసుపు విప్లవం (నూనెగింజలు), నీలివిప్లవం (మత్స్యపరిశ్రమ), స్వర్ణవిప్లవం (ఉద్యానవనాలు), ఎరుపు విప్లవం (టమాటా, మాంసం), వెండి విప్లవం (గుడ్లు), గుండ్రటి విప్లవం (బంగాళాదుంపలు), బూడిద విప్లవం (ఎరువులు) మొదలైనవన్నీ భాగంగా ఉంటాయి. ఇదొక గొడుగు విధానాన్ని, ఇంద్రధనుస్సులో రంగుల వర్ణపటాన్ని సూచిస్తుంది. ఈ విప్లవం బహుళ వ్యవసాయ, అనుబంధ రంగ విప్లవాలను ఏకీకృతం చేస్తుంది. వీటిలో ప్రతి ఒక్కటీ నిర్దిష్ట వస్తువు లేదా ఉపరంగాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. హరిత విప్లవం/ సస్య విప్లవం/ వ్యవసాయ విప్లవం: అధిక దిగుబడి ఇచ్చే రకాలు, ఎరువులు, నీటిపారుదల లాంటి ఆధునిక సాధనాల ద్వారా గోధుమ, వరి లాంటి ఆహార పంటల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించింది. మన దేశంలో హరిత విప్లవ పితామహుడిగా ఎం.ఎస్‌.స్వామినాథన్‌ను పేర్కొంటారు. 1950-51లో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్‌ టన్నులు ఉండగా, 2025-26లో 357.73 మి.ట.లుగా నమోదైంది. శ్వేత విప్లవం: పాల ఉత్పత్తిని, పాడి పరిశ్రమను ప్రోత్సహించడం లక్ష్యం. ఆపరేషన్‌ ఫ్లడ్‌ దీనికి ప్రధాన కారణం. ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలిపింది. శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌. సహకార మంత్రిత్వశాఖ, మత్స్య - పశుసంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వశాఖ సంయుక్తంగా 2024 సెప్టెంబరు 19న ‘శ్వేత విప్లవం 2.0ను ప్రారంభించాయి. వచ్చే అయిదేళ్లలో పాడి సహకార సంఘాల పాలసేకరణను 50% పెంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందింది. సహకార సంఘాల పరిధిని విస్తరించడం, మార్కెట్‌ ప్రాప్యతను మెరుగుపరచడం, ఉపాధి కల్పన, మహిళా సాధికారత దీని లక్ష్యాలు. 2014-15లో దేశంలో పాల ఉత్పత్తి 146.31 మి.ట.లు ఉండగా 2025-26 నాటికి 248 మి.ట.లకు పెరిగింది. పసుపు విప్లవం: భారతదేశం వంటనూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే విధంగా నూనెగింజల ఉత్పత్తి పెంచడంపై దృష్టి పెట్టింది. నూనె గింజల రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి 1986-87లో శ్యామ్‌ పిట్రోడా ఆధ్వర్యంలో దేశంలో ‘పసుపు విప్లవాన్ని’ ప్రారంభించారు. దేశీయ నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి, వంట నూనెల రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి ప్రభుత్వం 2024, అక్టోబరు 3న నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ - ఆయిల్‌ సీడ్స్‌ (ఎన్‌ఎంఈఓ-ఓఎస్‌) పథకాన్ని ప్రారంభించింది. 2024-25లో 39 మి.ట.లుగా ఉన్న నూనె గింజల ఉత్పత్తిని 2030-31 నాటికి 69.7 మి.ట.లకు పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. స్వర్ణ విప్లవం: దేశీయ వ్యవసాయంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు పండ్లు, కూరగాయలు, పువ్వులు, తేనె లాంటి ఉద్యాన పంటల విస్తరణను లక్ష్యంగా పెట్టుకుంది. నిర్పాఖ్‌ తుతెజ్‌ (Nirpakh Tutej) ను దీని పితామహుడిగా పేర్కొంటారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ 2026, జూన్‌ 11న విడుదల చేసిన రెండో ముందస్తు అంచనాల ప్రకారం, ఉద్యాన పంటల ఉత్పత్తి 2024-25లో 3707.38 లక్షల టన్నులు ఉండగా 2025-26లో అది 3777.76 ల.ట.లకు చేరుతుందని అంచనా. పండ్ల ఉత్పత్తి 2024-25లో ఉన్న 11765.49 లక్షల టన్నుల నుంచి 2025-26 నాటికి 1214.75 ల.ట.లకు చేరుతుందని అంచనా. కూరగాయల ఉత్పత్తి 2024-25లో 2177.97 ల.ట.లు ఉండగా 2025-26 నాటికి 2210 ల.ట.లకు చేరవచ్చని అంచనా. 2025-26 లో సుమారు 5,500 మెట్రిక్‌ టన్నుల తేనె ఉత్పత్తి జరిగింది. వెండి విప్లవం: గుడ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడం, కోళ్ల పరిశ్రమను బలోపేతం చేయడం ద్వారా ప్రోటీన్‌ వనరులను అందిస్తుంది. ఇందిరా గాంధీని ఈ విప్లవానికి మాతగా పేర్కొంటారు. కోడిగుడ్ల ఉత్పత్తి 2021-22లో 129.60 మి.టన్నులు ఉండగా 2024-25 నాటికి 149.11 మి.ట.లకు పెరిగింది. గుండ్రటి విప్లవం (బంగాళాదుంపలు): ఆలుగడ్డల ఉత్పత్తిపై దృష్టి పెడుతుంది. బూడిద విప్లవం: ఇది ఎరువుల ఉత్పత్తికి సంబంధించింది. ఎరుపు విప్లవం: మాంసం, టమాటా ఉత్పత్తిని అధికం చేయడం లక్ష్యం. మాంసం ప్రాసెసింగ్‌ రంగాన్ని అభివృద్ధి చేయడం ఇందులో భాగం. దీని పితా మహుడు విశాల్‌ తివారీ. 2014- 15లో దేశంలో మాంసం ఉత్పత్తి 6.69 మి.ట. ఉండగా 2024-25 నాటికి అది 10.5 మి.ట.లకు పెరిగింది. నీలి విప్లవం: దేశంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. డాక్టర్‌ అరుణ్‌ కృష్ణన్‌ను దీనికి పితామహుడిగా పేర్కొంటారు.





