
ఏ ఐపై నియంత్రణలో పరిశ్రమ కలిసి సాగేనా.. ప్రతిపాదనలపై చర్చ వాషింగ్టన్‌: కృత్రిమ మేధ (ఏఐ) పట్టపగ్గాల్లేకుండా అభివృద్ధి చెందితే మానవాళి మనుగడకే ప్రమాదమంటూ ఏఐ పరిశ్రమాధిపతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో దానిపై నియంత్రణ అనేది కత్తిమీద సాములానే కనిపిస్తోంది. అంతర్జాతీయ పోటీ, లాభాపేక్ష ధోరణులు, ప్రభుత్వ విధానాలు సమన్వయంతో చేయాల్సిన ప్రయత్నాలకు అడ్డుగా నిలిచే అవకాశముంది. అయినా కొన్ని ప్రతిపాదనలపై కొంత ఏకాభిప్రాయం వస్తోంది. స్వతంత్ర ఆడిటింగ్‌: ఆంథ్రోపిక్, ఓపెన్‌ ఏఐ, స్పేస్‌ ఎక్స్‌ వంటి అగ్రగామి సంస్థలు తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై స్వతంత్ర, బాహ్య మూల్యాంకనకర్తలకు నిరంతర పరిశీలనాధికారం ఇవ్వాలని ఆంథ్రోపిక్‌ అధిపతి అమోడై ప్రతిపాదించగా.. ఆల్ట్‌మన్‌ సమర్థించారు. అంతర్జాతీయ ఒప్పందాలు: జీవాయుధాల తయారీకి ఏఐని ఉపయోగించడం వంటి ప్రమాదకర కార్యకలాపాల నిషేధానికి దేశాల మధ్య ఒప్పందాలు కుదరాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధంతో పోలిక: ప్రచ్ఛన్న యుద్ద కాలంలో అమెరికా, సోవియట్‌ యూనియన్‌లు తాము ఉత్పత్తి చేసే అణు క్షిపణుల సంఖ్యను పరిమితం చేసినట్లుగానే.. ఏఐ పురోగతి రేటుపై కొన్ని నిబంధనలు విధించాలని అమోడై సూచించారు. ఏఐ వేగ నియంత్రణ సాధ్యమే అయినప్పటికీ.. ఆచరణలో ఇది సవాళ్లతో కూడుకున్నది. సైబర్‌ సెక్యూరిటీ, జీవాయుధ ముప్పుల వంటి రంగాల్లో నియంత్రణ ప్రమాణాల రూపకల్పన, ఏఐ మోడళ్లను విడుదల చేయడానికి ముందే వాటిని పరీక్షించడంవంటి అంశాల్లో అమెరికా, దాని ప్రత్యర్థుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం కష్టమే. తమకుతాముగా సొంత మెరుగైన వెర్షన్‌లను అభివృద్ధి చేసుకోగల ఏఐ మోడళ్లపై ‘స్పీడ్‌ లిమిట్‌’ విధించడం మరింత కష్టం. బాహ్య ఆడిటర్ల నియామకంవల్ల అధికార కేంద్రీకరణ పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తంమీద ఏఐ పరిశ్రమ ప్రముఖులు ఒకే తాటిపైకి రావడం ఆశావహమే అయినా.. ఏఐ భద్రతా ప్రమాణాలను ఆచరణలో పెట్టడంపై సందేహాలు కొనసాగుతున్నాయి. చైనాను అధిగమించాలనే ఉద్దేశంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఏఐపై పకడ్బందీ నియంత్రణకు సుముఖంగా లేరు. ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో టెక్నాలజీ అండ్‌ రెగ్యులేషన్‌ ప్రొఫెసర్‌ శాండ్రా వాక్టర్‌ మాట్లాడుతూ.. సిద్ధాంతపరంగా ఏఐ వేగ నియంత్రణ సాధ్యమే అయినా.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితి కారణంగా ఇది అత్యంత అవాస్తవికమైనదని అభిప్రాయపడ్డారు. ఏఐ కంపెనీలు తమ సాంకేతికత ద్వారా ఎదురయ్యే ముప్పులకు బాధ్యత వహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం, అలాగే డేటా సెంటర్లు విద్యుత్, నీరు, ఇతర వనరులను పొందే అవకాశాలను పరిమితంచేసే నిబంధనలను పాటించడం వంటివి ఏఐ వేగ నియంత్రణకు తోడ్పడతాయని ఆమె పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.