
పెండింగ్ బిల్లులు చెల్లించాలి: శ్రీనివాస్‌గౌడ్ ఖైరతాబాద్, సెప్టెంబర్ 16: గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ అధ్యక్షతన బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఏ పార్టీకి చెందినవారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్టు చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో సర్పంచులపై రాజకీయ ముద్రలు వేసి వేధిస్తున్నారని ఆరోపించారు. లే అవుట్ అనుమతుల ఫీజులు, ఇంటి పన్నులు, ఇతర స్థానిక పన్నుల ద్వారా పంచాయతీలకు వచ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఖాతాలను ఫ్రీజ్ చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 90 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా సర్పంచులు గ్రామాల్లో అనేక అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు చేపట్టారని, బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్రం అందించే గ్రాంట్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.





