

- సీఎం రేవంత్ వినాయక పూజ
- మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం
- కట్టుదిట్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు
CM Revanth Reddy: వినాయక చవితి పండగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్ననాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఉన్న అడ్డంకులు, విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఐశ్వర్యం, సకల విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన గణేశుడికి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ప్రత్యేక పూజలు నిర్వహించి, వాడవాడలా నిలిపిన మండపాల్లో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఉచిత విద్యుత్ సదుపాయం కొనసాగింపు:
ఉత్సవాలను ప్రజలు మరింత ఉత్సాహంగా జరుపుకునేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సీఎం వివరించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక మండపాలకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు:
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మండపాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు స్పష్టమైన సూచనలు చేశారు.





