

- తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
- నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్లో గట్టి వర్షపు జల్లులు
Telangana Rain: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ వర్షాలు పుంజుకోవడంతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపరితల ఆవర్తనం తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాల ప్రభావం గణనీయంగా పెరిగిందని, అనేక ప్రాంతాల్లో ముసురు వాతావరణంతో పాటు భీకర వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ:
ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం సాయంత్రం వేళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Telangana Rain) కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తూ ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు.
హైదరాబాద్లో గట్టి జల్లులు.. జాగ్రత్త:
ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే, నగరం వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఒకటి రెండు సార్లు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.





