
భారత హాకీ జట్టుకు యువ రక్తం ఎక్కించాల్సిన అవసరముందని దిగ్గజ గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ అభిప్రాయపడ్డాడు. దశాబ్దంన్నరకు పైగా భారత హాకీ చరిత్రలోనే అత్యుత్తమ గోల్‌కీపర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీజేష్‌.. ఇటీవలి ప్రపంచకప్‌లో ఇండియా వైఫల్యంపై, ఆసియా క్రీడల్లో జట్టు అవకాశాలపై ‘ఈనాడు’తో మాట్లాడాడు. ఆ విశేషాలు.. ప్రపంచకప్‌లో నిరాశాజనక ప్రదర్శన అనంతరం ఆసియా క్రీడలు భారత హాకీ జట్టుకు ఎంత కీలకం? ప్రపంచకప్, ఆసియా క్రీడలు పూర్తి భిన్నమైన టోర్నీలు. వరల్డ్‌ కప్‌లో ప్రపంచ అత్యుత్తమ జట్లు తలపడతాయి. ఆసియా క్రీడల్లో ఈ ఖండంలోని జట్లే తలపడతాయి. ఈ టోర్నీలో చాలా ఏళ్ల నుంచి మనదే ఆధిపత్యం. మరోసారి మన జట్టు ఇక్కడ స్వర్ణం సాధించడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి. ప్రపంచకప్‌ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని, బలంగా పుంజుకునేందుకు ప్రయత్నించాలి. ఆసియా నుంచి ప్రపంచ టాప్‌-10లో ఉన్న జట్టు మనది మాత్రమే. కాబట్టి ఆధిపత్యం భారత్‌దే అని ఆశిస్తున్నా. ఈ క్రీడల్లో భారత్‌-పాక్‌ పోరుపై ఏమంటారు? పాకిస్థాన్‌ ఒకప్పుడు గొప్ప జట్టు. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేది. తీవ్ర ఒత్తిడికి గురి చేసేది. కానీ ఇప్పుడా జట్టు బాగా బలహీన పడింది. ఇద్దరు ముగ్గురు బలమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. జట్టుగా పాకిస్థాన్‌ సమష్టి ప్రదర్శన చేసే స్థితిలో లేదు. పాకిస్థాన్‌ను భారత్‌ ఇప్పుడు తేలికగా ఓడించగలదు. ఇండియాతో పాటు పాకిస్థాన్, చైనా, మలేషియా సెమీఫైనల్‌కు వచ్చే అవకాశముంది. భారత జట్టులో యువ ఆటగాళ్లకు మరింతగా చోటివ్వాల్సిన అవసరముందా? కచ్చితంగా. ఏ జట్టయినా ముందుకు సాగాలంటే సందర్భానుసారం యువ ఆటగాళ్లను ఎంచుకోవడం ఎంతో అవసరం. భవిష్యత్‌ దిశగా ఆలోచించే క్రమంలో 2024 ఒలింపిక్స్‌ అవ్వగానే 2028 మీద దృష్టిసారించాలి. ఆ తర్వాత 2032 గురించి ఆలోచించాలి. అలాంటపుడు యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేయక తప్పదు. వారికి అవకాశాలిచ్చి అనుభవం సాధించేలా తీర్చిదిద్దాలి. గత కొన్నేళ్లుగా జూనియర్‌ సర్క్యూట్లో ఆడుతున్న యువ ఆటగాళ్లలో బాగా రాణిస్తున్న వారిని గుర్తించి సీనియర్‌ జట్టు వైపు నడిపించాలి. ప్రస్తుతం జట్టులోని కుర్రాళ్లకు ఆసియా క్రీడలు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఆసియా క్రీడల్లో విజేతగా నిలిచే జట్టు ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. కాబట్టి జట్టుకిది ముఖ్యమైన టోర్నీనే. ఒలింపిక్స్‌ కోణంలో చూస్తే యువ ఆటగాళ్లకు ఇది రిహార్సల్‌ లాంటి టోర్నీ. కానీ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఆసియా క్రీడల ప్రమాణాలు తక్కువ. కాబట్టి ఇక్కడి నుంచి మరింత మెరుగుపడే ప్రయత్నం చేయాలి. జాతీయ జట్టులోకి వచ్చే కుర్రాళ్ల మూలాలు బలంగా ఉండాలి. పరిస్థితులకు తగ్గట్లు అన్వయించుకోవడం కీలకం. జూనియర్‌ జట్టుతో పోలిస్తే సీనియర్‌ స్థాయిలో ఆట వేగం వేరుగా ఉంటుంది. తీవ్రత పెరుగుతుంది. శ్రమ కూడా ఎక్కువే ఉంటుంది. వీటన్నింటికీ ఎంత వేగంగా అన్వయించుకుంటారన్నది కీలకం. ఆటలో భారత్‌ మెరుగుపడాల్సిన అంశాలేంటి? మన ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదవ లేదు. కానీ దానికి మరింత మెరుగులు దిద్దుకోవాలి. ప్రపంచకప్‌లో భారత జట్టు ఎక్కువ గోల్స్‌ ఇచ్చేసింది. డిఫెన్స్‌లో మనం చాలా మెరుగుపడాలి. గోల్‌ అవకాశాలు కూడా చాలా వృథా అయ్యాయి. ఎటాకింగ్‌లోనూ మెరుగవ్వాల్సిన అవసరముంది. జట్టులో ఆటగాళ్ల మధ్య మంచి సమన్వయం ఉంది. కానీ అవతలి జట్లు ఎదురుదాడి చేసినపుడు నిలవలేకపోతున్నారు. ప్రత్యర్థి జట్లు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వాటిని తిప్పికొట్టే ప్రణాళికలతో ఉండాలి. ఐరోపా జట్లను అందుకోవడానికి ఏం చేయాలి? మనది ఎక్కువగా డిఫెన్స్‌ మీద ఆధారపడే జట్టు. అవసరాన్ని బట్టి దూకుడు చూపిస్తారు. ఐరోపా జట్లు ఎటాకింగ్‌లో వేరే స్థాయిలో ఉంటాయి. దాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పటికిప్పుడు అంతా మారిపోదు. దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలి. ఏదైనా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినపుడు దాని ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఈ విషయంలో ఆటగాళ్లు, కోచ్‌లు బలంగా నిర్ణయించుకుని రంగంలోకి దిగాలి. బహుశా భారత జట్టులో ఇప్పటికే భవిష్యత్‌ దిశగా కొత్త ప్రణాళికలు అమలై ఉంటాయనుకుంటున్నా. మున్ముందు వాటి ఫలితాలు చూస్తాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





