
సంస్థ సీఎండీతో సీఎం చంద్రబాబు భేటీ ఈనాడు, అమరావతి: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) రామాయపట్నం పోర్టు సమీపంలో చేపట్టనున్న చమురుశుద్ధి, పెట్రోకెమికల్‌ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని సీఎం చంద్రబాబు కోరారు.బీపీసీఎల్‌ సీఎండీ సంజయ్‌ ఖన్నా, ఇతర అధికారుల బృందంతో బుధవారం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘బీపీసీఎల్‌ రిఫైనరీ నిర్మాణానికి అవసరమైన 6 వేల ఎకరాల్లో ఇప్పటికే 75% అప్పగించాం. మిగిలిన భూమిని అక్టోబరు రెండో వారానికి అప్పగిస్తాం. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. రిఫైనరీ సమీపంలో సుమారు 1,500 ఎకరాల్లో డౌన్‌స్ట్రీమ్‌ పెట్రోకెమికల్‌ పార్కు ఏర్పాటుకు బీపీసీఎల్, ఏపీఐఐసీ కలిసి ప్రణాళిక రూపొందిందాలి’ అని సూచించారు. బీపీసీఎల్‌ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని సంస్థ సీఎండీ సీఎంకు వివరించారు. ‘ఏడాదికి 9 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా యూరో-6 ప్రమాణాలతో ఇంధనం ఉత్పత్తి కానుంది. ఈ నెలాఖరుకు ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి వచ్చే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ ఇండియా లిమిటెడ్‌ చేపట్టిన అధ్యయన నివేదిక వచ్చిన తర్వాత.. ఈ ఏడాది అక్టోబరులో తుది పెట్టుబడి వ్యయం ఖరారు అవుతుంది. ఆ తర్వాత రిఫైనరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





