
అఫ్గాన్‌తో భారత్‌ చివరి టీ20 నేడు రాత్రి 7.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో దిల్లీ అ ఫ్గానిస్థాన్‌తో తొలి రెండు టీ20ల్లో అలవోకగా గెలిచిన టీమ్‌ఇండియా.. క్లీన్‌స్వీప్‌పై గురి పెట్టింది. దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్‌ గురువారం జరగనుంది. భారత్‌ జోరును అడ్డుకుని వైట్‌వాష్‌ను తప్పించుకోవడం అఫ్గాన్‌కు అసాధ్యంగానే కనిపిస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్‌ గెలిచి బౌలింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. ప్రత్యర్థిని 160 లోపు కట్టడి చేసింది. తొలి టీ20లో ఛేదన 14వ ఓవర్లో పూర్తయితే, రెండో మ్యాచ్‌కు ఇంకో ఓవర్‌ ఎక్కువ పట్టిందంతే. బ్యాటింగ్‌లో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ చెలరేగగా.. తొలి టీ20 వైఫల్యం తర్వాత సంజు శాంసన్, రెండో మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. అయితే తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకోలేకపోయిన యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీకి.. ఈ మ్యాచ్‌లో అయినా ఛాన్స్‌ లభిస్తుందా అన్నది చూడాలి. అతడిని ఆడించాలనుకుంటే.. సంజు శాంసన్, అభిషేక్‌ శర్మల్లో ఎవరిని పక్కన పెడతారన్నది ఆసక్తికరం. సిరీస్‌ ఇప్పటికే సొంతమైన నేపథ్యంలో తుది జట్టులో ఇంకొన్ని మార్పులు ఉండొచ్చు. బుమ్రాకు విశ్రాంతినిచ్చి యశ్‌ ఠాకూర్‌ను ఆడించే అవకాశాలున్నాయి. నితీశ్‌కుమార్‌ రెడ్డి, శివమ్‌ దూబెల్లో ఒకరిని పక్కన పెట్టి వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడించొచ్చు. సిరీస్‌లో భారత బౌలింగ్‌ కూడా బాగానే సాగుతున్నప్పటికీ.. రెండు మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన ప్రత్యర్థిని ఆఖర్లో కట్టడి చేయలేక అనుకున్న దాని కంటే ఎక్కువ పరుగులు చేయనిచ్చారు బౌలర్లు. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి. భారత్‌కు ఏమాత్రం పోటీనివ్వలేకపోతున్న అఫ్గాన్‌.. వైట్‌వాష్‌ తప్పించుకోవడానికి ఎంతమేర పోరాడుతుందో చూడాలి. రెండు మ్యాచ్‌ల్లోనూ డకౌటైన విధ్వంసక ఓపెనర్‌ గుర్బాజ్‌ ఈ మ్యాచ్‌లో అయినా నిలుస్తాడేమో చూడాలి. అతడితో పాటు కెప్టెన్‌ ఇబ్రహీం జాద్రాన్‌.. ఆల్‌రౌండర్లు అజ్మతుల్లా, మహ్మద్‌ నబి, రషీద్‌ ఖాన్‌ రాణించడం ఆ జట్టుకు కీలకం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





