
టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ భారత్‌ పర్వ్‌ రిసెప్షన్‌ కార్యక్రమంలో రామోజీ గ్రూప్‌ సీఎండీ సీహెచ్‌ కిరణ్‌ టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీ స్టాల్‌ వద్ద కెనడా ఫెడరల్‌ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మార్క్‌ మిల్లర్‌తో రామోజీ గ్రూప్‌ సీఎండీ సీహెచ్‌ కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి. చిత్రంలో ఈటీవీ ఎండీ కె.బాపినీడు, అంతర్జాతీయ బిజినెస్‌ కన్సల్టెంట్లు చంద్ర, ప్రజయ్‌ కామత్, బాలరాజ్‌ టొరొంటో: ‘సినిమాల చిత్రీకరణను అత్యంత ఆహ్లాదకరంగా, సృజనాత్మకంగా, సమయానుసారం నిర్వహించేందుకు అత్యంత అనువైనదనే క్లయింట్ల నమ్మకం... కార్యకలాపాలు/వ్యవహారాల్లో పారదర్శకత... నిర్వహణ సామర్థ్యాల్లో ప్రపంచశ్రేణి పాటవాన్ని చూపడమే.. రామోజీ ఫిల్మ్‌ సిటీ విజయ రహస్యం’ అని రామోజీ గ్రూప్‌ సీఎండీ సీహెచ్‌ కిరణ్‌ తెలిపారు. కెనడాలోని టొరొంటోలో ఈ నెల 10 నుంచి 20 వరకు జరుగుతున్న 51వ టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టిఫ్‌)లో భాగంగా భారత్‌ పర్వ్‌ రిసెప్షన్‌లో ప్రత్యేక అతిథిగా హాజరైన కిరణ్‌ ఈ వివరాలు వెల్లడించారు. ‘భారత్‌ మీడియా- వినోద రంగంలో సరికొత్త అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ప్యానెల్‌ చర్చలో ఆయన మాట్లాడారు. రామోజీ ఫిల్మ్‌ సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ విజయేశ్వరి, ఈటీవీ ఎండీ కె. బాపినీడు కూడా ప్యానెల్‌ చర్చలో పాల్గొన్నారు. వీరిని నిర్వాహకులు సత్కరించారు. కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (టొరొంటో)తో కలిసి సమాచార మంత్రిత్వ శాఖ, నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భారత్, కెనడాల్లోని సృజనాత్మక రంగాల ప్రముఖులు, చలనచిత్ర దర్శకులు - నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని సదుపాయాలు, అక్కడి వసతుల గురించి నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. భారత్‌లో ఇంతకుముందు షూటింగ్‌ చేయని కెనడా, అమెరికా చిత్ర నిర్మాతలకు కలిగే ప్రయోజనాలనూ కిరణ్‌ వివరించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీ సుమారు 2,000 ఎకరాల్లో విస్తరించి, ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ స్టూడియో కాంప్లెక్స్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకుందని కిరణ్‌ వివరించారు. అంతర్జాతీయ చిత్ర పరిశ్రమకు అవసరమైన సమగ్ర నిర్మాణ సేవలు అందించే కీలక వేదికగా నిలుస్తోందన్నారు. సినిమా నిర్మాణ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ సామర్థ్యాలు అపారంగా ఉన్నాయని తెలిపారు. ‘భారత్‌లో 140 కోట్ల మందికి పైగా ప్రజలున్నారు. వీరిలో సినిమాలు చూసేవారి సంఖ్య అత్యధికం. సినిమా చిత్రీకరణలో పాలుపంచుకునే సృజనశీలురు కూడా అధికమే. చిత్రీకరణ నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వరకు.. మొత్తం చిత్ర నిర్మాణ ప్రక్రియకు అవసరమైన సేవలన్నీ ఆర్‌ఎఫ్‌సీలో లభిస్తాయి. నిర్దేశించుకున్న సమయానికి సినిమాను సిద్ధం చేసేందుకు 24 గంటల పాటు మా యంత్రాంగం శ్రమిస్తుంది’ అని కిరణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా కెనడా ఫెడరల్‌ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మార్క్‌ మిల్లర్‌ను కిరణ్, విజయేశ్వరి, బాపినీడు కలిశారు. మీడియా, వినోద రంగాల్లో భారత్, కెనడా మధ్య సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.