
శ్రీవారి విశిష్టతను కళ్లకుకట్టే డివోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ దీంతోపాటు ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియంను ప్రారంభించిన సీఎం 32 ఎలక్ట్రిక్‌ బస్సుల సేవలకు శ్రీకారం భక్తులకు ఉచిత బీమా అందుబాటులోకి.. తిరుమలలో ఎలక్ట్రిక్‌ బస్సులో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో రిలయన్స్‌ ఈవీ మొబిలిటీ సీఈవో నితిన్‌ సేథ్, తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్ల, పనబాక లక్ష్మి తదితరులు ఈనాడు డిజిటల్‌- తిరుపతి, న్యూస్‌టుడే- తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో తితిదే చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆధ్యాత్మికతకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ భక్తులకు సరికొత్త అనుభూతులను పంచేలా.. తిరుమల హీలింగ్‌ అండ్‌ డివోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్, అత్యాధునిక హంగులు అద్దుకున్న శ్రీవేంకటేశ్వర మ్యూజియం, భక్తులకు తితిదే కల్పించిన ఉచిత బీమా, నందకం యాప్‌తోపాటు దాతలు అందించిన ఎలక్ట్రిక్‌ బస్సులను సీఎం ప్రారంభించారు. రిలయన్స్, భారత్‌ బయోటెక్‌ ఫౌండేషన్‌ అందించిన ఎలక్ట్రిక్‌ బస్సులకు పూజలు చేస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తదితరులు కళ్లెదుటే జరుగుతున్నట్లుగా..: శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోవేచి ఉండే సమయాన్ని ఆధ్యాత్మికంగా సద్వినియోగం చేసుకునేలా 17వ కంపార్ట్‌మెంట్‌లో ‘తిరుమల హీలింగ్‌ అండ్‌ డివోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందులోని ‘దుర్లభ దర్శన్‌’ వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) అనుభవాన్ని, హెడ్‌సెట్‌ ద్వారా 13 నిమిషాల నిడివిగల 3డీ, 360 డిగ్రీల వీడియోను ఆసక్తిగా తిలకించారు. సాధారణ భక్తులకు వీక్షించే అవకాశం లభించని సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అభిషేకం తదితర విశిష్ట సేవలను వీఆర్‌ ద్వారా కళ్లెదుటే జరుగుతున్నట్లుగా భక్తులు అనుభూతి చెందవచ్చు. ఈ కేంద్రాన్ని ఎన్నారై దాత జయప్రకాష్‌ సహకారంతో ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్రం విశేషాలను సీఎంకు వివరించారు. తిరుమల వైకుంఠం కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన డివోషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో వర్చువల్‌ రియాలిటీ పరికరంతో శ్రీవారి విశిష్ట సేవలను వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ఎస్వీ మ్యూజియంలో త్రీడీ వీడియోను వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు బ్రహ్మాండం.. ఎస్వీ మ్యూజియం : టీసీఎస్‌ సంస్థ సహకారంతో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో, 4 అంతస్తుల్లో 14 ప్రత్యేక గ్యాలరీలతో పునరుద్ధరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని సీఎం ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు తదితర రాజులు స్వామివారికి సమర్పించిన ఆభరణాల నమూనాలు, ఆయుధాలు, సంగీత వాయిద్యాలను సీఎం నిశితంగా పరిశీలించారు. ఎస్వీ గ్యాలరీలోని ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాలను, బ్రహ్మాండం గ్యాలరీలో సుమారు ఏడు నిమిషాలపాటు ప్రదర్శించిన అత్యాధునిక ఏడుకొండల త్రీడీ మోడళ్లను సీఎం ఆసక్తిగా తిలకించారు. వాటి విశేషాలను అదనపు ఈవోతోపాటు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో ఈమని శివనాగిరెడ్డి వివరించారు. ఎస్వీ మ్యూజియంలోని శ్రీవారి విగ్రహ విశేషాలను సీఎం చంద్రబాబుకు వివరిస్తున్న ఈమని శివనాగిరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్ల, తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరి తదితరులు పర్యావరణహితంగా 3 నిమిషాలకో బస్సు: భక్తుల ఉచిత రవాణా కోసం విరాళంగా అందిన 32 ఎలక్ట్రిక్‌ బస్సులను (శ్రీవారి ధర్మరథాలు) నారాయణగిరి ఉద్యానవనం వద్ద సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 25 బస్సులను రిలయన్స్, ఏడు బస్సులను భారత్‌ బయోటెక్‌ సంస్థ అందజేశాయి. కొత్తవాటితో కలిపి తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య 50కి చేరింది. దీంతో రోజుకు 300గా ఉన్న ట్రిప్పుల సంఖ్య 810కి పెరగనుంది. ప్రధాన మార్గాల్లో భక్తులకు మూడు నిమిషాలకో బస్సు అందుబాటులో ఉండనుంది. ఈవీ బస్సు ప్రారంభించిన అనంతరం అందులోనే సీఎం ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. తిరుమలకు వచ్చే భక్తులు, శ్రీవారి సేవకులకు రూ.2 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని సీఎం ప్రారంభించారు. దీనికి భక్తులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. ః తిరుమల వసతి గదుల్లో విద్యుత్, ప్లంబింగ్, కార్పెంట్రీ తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ‘నందకం’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.కార్యక్రమాల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, జేఈవో శరత్, ఎస్వీబీసీ ఛైర్మన్‌ శ్రీధర్‌వర్మ, రిలయన్స్‌ ఈవీ మొబిలిటీ సీఈవో నితిన్‌ సేథ్, భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల, టీసీఎస్‌ ప్రతినిధులు కృతివాసన్, వి.రాజన్న పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





