
సింగపూర్‌ ప్రతినిధులకు వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌ ప్రతినిధి అగస్టీన్‌ లీతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నెట్‌ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో బుధవారం సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టీన్‌ లీతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు సింగపూర్‌ ప్రతినిధులు సీఎంకు వివరించారు. అనంతరం సీఎం వారికి మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి వంటి అంశాలను వివరించారు. ‘‘తొలిదశలో మూసీ, ఈసీ నదుల సంగమమైన గాంధీ సరోవర్‌ వరకు మూసీ పునరుజ్జీవం చేపట్టనున్నాం. రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధితోపాటు నైట్‌ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశాం. హైదరాబాద్‌ను పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్‌ హబ్‌గానూ తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలు, ఎంఐటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ తమ ఆఫ్‌ షోర్‌ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. రాష్ట్రంలో మీ పెట్టుబడులకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ఫ్యూచర్‌ సిటీలో డిసెంబరులో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌కు హాజరు కావాలి’ అని సీఎం వారిని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టడానికి సింగపూర్‌ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ చోంగ్, కాన్సుల్‌ జనరల్‌ విలియం చిక్, ఇతర సింగపూర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





