
ముంబయి: క్యాన్సర్‌ చికిత్సలో అత్యంత ప్రభావవంతమైన అత్యాధునిక ‘కాంపాక్ట్‌ ప్రోటాన్‌ థెరపీ’ వ్యవస్థలను మనదేశంలో తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్‌ మెడికల్‌ టెక్నాలజీ సంస్థ పి-క్యూర్‌తో దేశీయ ఆరోగ్య సంరక్షణ కంపెనీ అరిస్టియన్‌ ప్రోటాన్‌ సెంటర్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ప్రోటాన్‌ థెరపీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అరిస్టియన్‌ దాదాపు రూ.1900 కోట్ల దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టనుంది. బెంగళూరులో అరిస్టియన్‌కు చెందిన 660 పడకల క్వాటర్నరీ క్యాంపస్‌ ‘సెంటియంట్‌ హెల్త్‌ సిటీ’ (ఏఐ, ఆధునిక కేర్‌ సొల్యూషన్స్‌తో నిర్మించిన ఆసుపత్రి)లో దేశంలోనే తొలి కాంపాక్ట్‌ ప్రోటాన్‌ థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెండో కేంద్రాన్ని కేరళంలోని కోచిలో ఏర్పాటు చేస్తారు. మూడో కేంద్రం కోసం ప్రదేశం, వ్యూహాత్మక భాగస్వాముల ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. ‘మన దేశంలో రోగుల ఆర్థిక స్థోమతకు అందుబాటులో ఉండేలా, ప్రపంచంలోనే అత్యంత అధునాతన రేడియేషన్‌ థెరపీని అందించడమే మా లక్ష్యం’ అని అరిస్టియన్‌ సీఎండీ, రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ లోహిత్‌ జి.రెడ్డి పేర్నొన్నారు. భారత్‌ వంటి అధిక జనాభా, విస్తృత డిమాండ్‌ ఉన్న మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని అల్ట్రాకాంపాక్ట్‌ వ్యవస్థను రూపొందించామని పి-క్యూర్‌ సీఈఓ మైఖేల్‌ మరాష్‌ తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





