
శ్రేణులతో కలిసి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వీర్రాజు మామిడికుదురు, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను అత్యంత సమర్థంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్‌’ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. మామిడికుదురులో ఆదివారం ఆయన భాజపా శ్రేణులతో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా 13, ప్రధానమంత్రిగా 12 ఏళ్లు మోదీ పాలనలో పలు సంస్కరణలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాల సాధనకు పురోగమిస్తున్నారన్నారు. నెల రోజుల పాటు అన్ని గ్రామాల్లోనూ 13 కార్యక్రమాలను అమలు చేయాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు, యువతతో రక్తదాన శిబిరాలు, గ్రామాల్లో స్వచ్ఛభారత్, ఇంటింటికీ వెళ్లి ప్రగతిని వివరించడం వంటివి నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో పలు పథకాలు, అభివృద్ధి పనులకు కేంద్రం ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులంతా విజయం సాధించేలా శ్రేణులు, కార్యకర్తలంతా సమన్వయంతో కృషి చేయాలని కోరారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు 17 జిల్లాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భాజపా జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.వేమా, గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి యాళ్ల దొరబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్, మండల శాఖ అధ్యక్షుడు భైరిశెట్టి దుర్గారామకృష్ణ, నాయకులు మెండా ఆదినారాయణ, గాడి సత్తిబాబు, కంకిపాటి సుబ్బారావు, గంగాధరం తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





