
అది ప్రగతికి ప్రతిబంధకం బ్రిక్స్‌ వేదికగా ప్రధాన మంత్రి మోదీ హెచ్చరిక కీలక ఖనిజాల సరఫరాకు ఆటంకాలపై ఆందోళన సహకారం పెంపునకు 5 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించిన జిన్‌పింగ్‌ ధాన్యం మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుందాం: పుతిన్‌ విజయవంతంగా ముగిసిన బ్రిక్స్‌ సదస్సు దిల్లీలో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీతో ఈజిప్టు, రష్యా, చైనా అధ్యక్షులు అబ్దుల్‌ ఫతా ఎల్‌-సిసి, పుతిన్, జిన్‌పింగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్, మలేసియా, ఇథియోపియా, వియత్నాం ప్రధానులు అన్వర్‌ ఇబ్రహీం, అబియ్‌ అహ్మద్‌ అలీ, లే మిన్‌ హంగ్, వివిధ దేశాల ప్రతినిధులు దిల్లీ: పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిక్స్‌ దేశాలు పరస్పర సహకారం, సమ్మిళిత వృద్ధిద్వారా ఆ సవాళ్లను అధిగమించాలని.. మానవాళి వికాసానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. సాంకేతికత, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చుకుంటున్న తీరుపైనా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల ఉమ్మడి ప్రగతికి ఆటంకాలు ఏర్పడతాయని హెచ్చరించారు. దిల్లీ వేదికగా రెండు రోజులపాటు విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా ఆదివారం ప్రధాని ప్రసంగించారు. అంటువ్యాధుల నియంత్రణ, సరఫరా గొలుసులు, అంకుర సంస్థలకు సంబంధించి సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రిక్స్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌.. ప్రధానంగా ఆవిష్కరణలు, సవాళ్లను తట్టుకునే శక్తి, సహకారం, సుస్థిరత అనే నాలుగు మూలస్తంభాలపై దృష్టి పెట్టినట్లు మోదీ తెలిపారు. బ్రిక్స్‌ కనుగొనే పరిష్కార మార్గాల ప్రయోజనాలు కూటమికే పరిమితం కావొద్దని.. దక్షిణార్ధ గోళ దేశాలకూ అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో తలెత్తే సంక్షోభాలు ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాబోవని మహమ్మారులు, ప్రకృతి విపత్తులు, సరఫరా అంతరాయాలు చాటి చెప్పాయని పేర్కొన్నారు. అందుకే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల శక్తిని బ్రిక్స్‌ సమకూర్చుకోవడంపై దృష్టి సారించామని చెప్పారు. ఇందులో భాగంగానే.. బ్రిక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎర్లీ వార్నింగ్‌ సిస్టమ్, సరఫరా వ్యవస్థల సహకార ఫ్రేమ్‌వర్క్, బ్రిక్స్‌ ఇంక్యుబేటర్‌ నెట్‌వర్క్, స్టార్టప్‌ ఇన్నోవేషన్‌ ఫండ్, బ్రిక్స్‌ నెట్‌వర్క్‌ ఆన్‌ డిజిటల్‌ అగ్రికల్చర్‌ వంటి వేదికల ఏర్పాటుకు అంగీకరించామని తెలిపారు. సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో కలిసికట్టుగా ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికతలు, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చుకుంటే ఉమ్మడి ప్రగతి దెబ్బతింటుందని హెచ్చరించారు. అత్యాధునిక సాంకేతికతలను ఇతరులతో పంచుకునేందుకు చైనా విముఖత చూపుతుండటం, కీలక ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయనవ్యాఖ్యలు ప్రాధాన్యంసంతరించుకున్నాయి. బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ఆదివారం దిల్లీలోని భారత్‌ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా, రష్యా అధ్యక్షులు షీ జిన్‌పింగ్, వ్లాదిమిర్‌ పుతిన్‌ల మాటామంతీ వర్ధమాన మార్కెట్లు, దక్షిణార్ధ గోళ దేశాలతో ఉన్న సన్నిహిత సంబంధాలను బ్రిక్స్‌ సరిగా ఉపయోగించుకోవాలని.. తద్వారా సరఫరా వ్యవస్థలను పరిరక్షించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. తయారీ, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో సహకారం పెంపునకు 5 పాయింట్ల ప్రణాళికను బ్రిక్స్‌ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ప్రతిపాదించారు. సమ్మిళిత కృత్రిమ మేధ ఫ్రేమ్‌వర్క్‌ను స్థాపించుకోవడం, వాణిజ్యం-పెట్టుబడులను పెంచుకోవడం, డిజిటల్‌ ఇండస్ట్రీ సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఇంటెలిజెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడం, ఉమ్మడి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇందులో భాగాలు. బ్రిక్స్‌ దేశాలు కొత్త బీమా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని.. ప్రత్యేక ధాన్యం మార్కెట్‌ ఏర్పాటుకూ సంయుక్తంగా కృషి చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిపాదించారు. అంతర్జాతీయ సవాళ్లను అధిగమించేందుకు కూటమి సమగ్ర విధానాన్ని అవలంబించాలని సూచించారు. బ్రిక్స్, దక్షిణార్ధ గోళ దేశాల ఆర్థిక వృద్ధి కోసం నూతన కార్యక్రమాలను ఆయన ప్రతిపాదించారు. బ్రిక్స్‌ స్థాపించిన న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) పనితీరును ప్రశంసించారు. అది ప్రస్తుతం 140 బిలియన్‌ డాలర్ల ప్రాజెక్టులను నిర్వహిస్తోందని గుర్తుచేశారు. బ్రిక్స్‌ ఆర్థిక వృద్ధి కోసం ప్రత్యేక వేదిక అవసరమని పుతిన్‌ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ తీరిక లేకుండా గడిపారు. గత మూడు రోజుల్లో 15 మంది దేశాధినేతలు/ప్రభుత్వాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా ఎల్‌-సిసి, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో, బురుండీ అధ్యక్షుడు ఎవరిస్టే, కజకిస్థాన్‌ అధ్యక్షుడు కసిమ్‌-జొమార్ట్‌ తొకయేవ్, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, నైజీరియా ఉపాధ్యక్షుడు కషీం షెట్టిమాలతో ఆదివారం ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారితో చర్చలు జరిపారు. పౌర మౌలిక వసతులు, అణు కేంద్రాలపై దాడులు జరుగుతుండటం పట్ల బ్రిక్స్‌ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాయుధ ఘర్షణల సమయంలోనూ అణు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకతను ‘దిల్లీ డిక్లరేషన్‌’లో నొక్కిచెప్పారు. జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని విస్తరించుకుందాం: పెజెష్కియాన్‌ ప్రధాని మోదీని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ బ్రిక్స్‌ దేశాలు తమ జాతీయ కరెన్సీల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని.. అంతర్జాతీయ సమ్మిళిత ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటుకు కృషి చేయాలని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలవల్ల వర్ధమాన దేశాలు ఇబ్బంది పడుతున్నాయని గుర్తుచేశారు. పాశ్చాత్య శక్తులు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షల వల్ల అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రజా సంక్షేమం ప్రమాదంలో పడుతోందని విమర్శించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.