
ప్రతిమలు పంపిణీ చేస్తున్న ఎస్సై ఉమామహేశ్వరరావు చీపురుపల్లి గ్రామీణం: మెట్టపల్లి నవభారత్‌ యువజన సేవా సంఘం అధ్యక్షుడు యు.హరి, గ్రామ యువత ఏడేళ్లుగా మట్టి విగ్రహాల పంపిణీ చేపడుతున్నారు. తొలుత మెట్టపల్లికే పరిమితమైనా ఈ ఏడాది సంకుపాలెం, గచ్చలవలస, కర్లాం, కరకాం, ఎలకలపేట తదితర గ్రామాల్లో దాతల సహకారంతో మట్టి విగ్రహాలు, వినాయక వ్రత కథ పుస్తకాలను అందజేశారు. ఒక్కో గ్రామానికి 100 చొప్పున ప్రతిమలు పంపిణీ చేశారు. గుర్ల: పర్యావరణ పరిరక్షణ కోసం ఆనందపురం యువత నడుం బిగించింది. రంగులతో తయారు చేసిన వినాయకుల ఏర్పాటు, నిమజ్జనం తర్వాత కలిగే దుష్ప్రభావాలను గ్రామస్థులకు వివరించారు. దీంతో ఆ గ్రామస్థులు ఏడేళ్లుగా మట్టి వినాయకుడినే పూజిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజాం: రాజాం పట్టణంలోని చినచెరువు గట్టు యువకులు, పిల్లలు ఏటా విభిన్న రూపాల్లో లంబోదరుడ్ని తీర్చిదిద్దుతున్నారు. గతేడాది సిల్వర్‌ స్టోన్స్‌ విఘ్నేశ్వరుడిని తీర్చిదిద్దారు. అంతకు ముందు సంవత్సరాల్లో చొక్కా గుండీలు, నెమలి పింఛాలు, డెయిరీమిల్క్‌ చాక్లెట్లు, గవ్వలు, కొబ్బరికాయలు, నాణేలతో ప్రతిమలు కొలువుదీర్చారు. యువకులు మహేష్, లాజర్, కృష్ణ, అనంత్, తిరుమల, అశోక్, ప్రసాద్, జగదీష్, లోకేశ్వరరావుల ఆధ్వర్యంలో ఈ ఏడాది బాదంపిక్కలతో ప్రతిమను తీర్చిదిద్దారు. మట్టి ప్రతిమలను కొలువుదీర్చేది కొందరు.. పంపిణీ చేసేది మరికొందరు.. రసాయనాల హాని లేకుండా విగ్రహాలకు రూపునిచ్చేది ఇంకొందరు. జిల్లాలోని పలు గ్రామాల్లో యువత వినాయక చవితి వేడుకను గత కొన్నేళ్లుగా విభిన్నంగా చేస్తున్నారు. ఆధ్యాత్మిక వేడుకలో ప్రకృతి ఆరాధనే ప్రథమ బాధ్యతగా సాగుతున్నారు. ఆరేళ్లుగా మట్టి విగ్రహాల పంపిణీ జరజాపుపేట: జరజాపుపేటలో ఆరేళ్లుగా మట్టి గణపతి విగ్రహాలను సాధన యువజన సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. మట్టి విగ్రహాల ప్రాధాన్యం తెలియజేసి ఏటా సుమారు 500 ప్రతిమలు అందజేస్తున్నారు. యువజన సంఘం ప్రతినిధులు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని కాపు వీధిలో శ్రీబాల గణపతి అసోసియేషన్, కాపు వీధి బాయ్స్‌ ఆధ్వర్యంలో నవధాన్యాలతో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఏడున్నర అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసి.. దానికి నవధాన్యాలు అతికించి అందంగా తీర్చిదిద్దారు. గోధుమలు, బియ్యం, కందులు, పెసలు, శనగలు, మినుములు, నువ్వులు, ఉలవలు, అలసందలతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించనున్నారు. న్యూస్‌టుడే,శృంగవరపుకోట విజయనగరంలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సమీపంలో 25 వేల మొక్కజొన్న పొత్తుల గింజలతో ఎనిమిది అడుగుల గణపతి విగ్రహాన్ని ఇలా తీర్చిదిద్దారు. ఇరవై ఏళ్లుగా ఏదో ఒక ప్రత్యేకతతో విగ్రహాన్ని ఈ కమిటీ నిర్వాహకులు ఏటా ఏర్పాటు చేస్తున్నారు. - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం నెల్లిమర్ల: పర్యావరణ పరిరక్షణ కోసం శ్రీరామతీర్థం సేవా సంఘం ఆధ్వర్యంలో నెల్లిమర్లలో ఏటా 1,500 మట్టి విగ్రహాలను అయిదేళ్లుగా పంపిణీ చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





