
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతున్న రామచందర్‌రావు. చిత్రంలో కొమరయ్య, పాల్వాయి హరీశ్, శ్రీవర్ధన్‌రెడ్డి, లక్ష్మణ్, బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు రాంనగర్, న్యూస్‌టుడే: ఆపరేషన్‌ పోలోలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు భాజపా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్‌ నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న యుద్ధ ట్యాంక్‌ వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ.. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవ, తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాల ఫలితంగా హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. సర్దార్‌ పటేల్‌ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ పోలో హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి నిర్ణయాత్మకంగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ..విమోచన చరిత్రను రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, భావితరాలకు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను తెలియజేయాలని సూచించారు. ఆపరేషన్‌ పోలోలో సేవలందించిన విశ్రాంత ఆర్మీ జవాన్లను విమోచన కమిటీ ఛైర్మన్‌ డా.బూర నర్సయ్యగౌడ్‌ నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, ఎమ్మెల్సీ కొమరయ్య, డా.గౌతంరావు, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





