
నేడు అంకురార్పణ రేపు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం ఆదివారం రాత్రి విద్యుత్తు దీపాల వెలుగుల్లో శ్రీవారి ఆలయం తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అంకురార్పణ క్రతువును తితిదే నిర్వహించనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ఆలయంలోని యాగశాలలో రాత్రి 7-8 గంటల మధ్య ఈ క్రతువు జరగనుంది. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు దీన్ని చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి, ఈ భూమండలమంతా పాడిపంటలు, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. మంగళవారం సాయంత్రం 6.21 నుంచి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఉంటుంది. బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేసి, సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి, దర్శనం చేసుకోనున్నారు. అనంతరం మాడవీధుల్లో పెద్దశేషవాహనంలో ఊరేగే ఉత్సవమూర్తిని దర్శించుకుంటారు. మంత్రి లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులూ హాజరు కానున్నారు. బుధవారం తిరుమలలో రూ.300 కోట్ల విలువైన పనులను సీఎం ప్రారంభించనున్నారు. ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియం, రిలయన్స్‌ సంస్థ ఇచ్చిన 25 ఎలక్ట్రిక్‌ బస్సులు, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, తితిదే బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్ల దంపతులు అందించిన 7 ఎలక్ట్రిక్‌ బస్సులను, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని పిలిగ్రిమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని, ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత బీమా, తితిదే నందకం యాప్‌ను ఆయన ప్రారంభిస్తారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





