
సుదూర లక్ష్యాలపైనా విరుచుకుపడ్డాం రక్షణశాఖ వార్షిక నివేదికలో ప్రస్తావన భొలారిలో దెబ్బతిన్న పాక్‌ వైమానిక స్థావరం దిల్లీ: ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను భారత రక్షణశాఖ తాజాగా విడుదల చేసిన 2025-26 వార్షిక నివేదిక వెల్లడించింది. గతేడాది మే నెలలో పాకిస్థాన్‌లోని లక్ష్యాలపై భారత వాయుసేన జరిపిన దాడులను వివరించింది. నివేదికలో ప్రస్తావించిన ముఖ్యాంశాలివీ.. తమపై దాడులకు కారణమైన ఉగ్రవాద మౌలిక వసతులపై విరుచుకుపడే లక్ష్యంతో ఆపరేషన్‌ సిందూర్‌ను భారత్‌ ప్రారంభించింది. దానికి పాక్‌ స్పందించిన తీరు కారణంగా అది నాలుగు రోజుల ఘర్షణగా మారింది. డ్రోన్లు, క్షిపణులతో భారత సైనిక లక్ష్యాలపై దాడికి పొరుగు దేశం ప్రయత్నించడంతో పాక్‌ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసే వ్యూహాన్ని మన వాయుసేన అనుసరించింది. అందులో భాగంగా పాక్‌ వైమానిక స్థావరాలు, రన్‌వేలు, గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంది. భారత్‌కు చెందిన ఎస్‌-400 గగనతల రక్షణ యూనిట్‌.. 314 కిలోమీటర్ల దూరంలోని ప్రత్యేక మిషన్‌ విమానాన్ని ధ్వంసం చేసింది. తద్వారా.. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్రంతో సుదూర లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ ఆపరేషన్‌ తర్వాత 2025 మే 12న ఆదంపుర్‌లోని భారత వాయుసేన స్థావరాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి సిబ్బందిని అభినందించారు. పాక్‌ వైమానిక స్థావరాల్లో విమానాలను భద్రపరిచే నాలుగు హ్యాంగర్లను విజయవంతంగా భారత వాయుసేన లక్ష్యంగా చేసుకుంది. జకోబాబాద్‌లో జరిగిన దాడుల్లో పలు ఎఫ్‌-16 యుద్ధ విమానాలు, గగనతల ముందస్తు హెచ్చరిక విమానాలు (ఏఈడబ్ల్యూ అండ్‌ సీ), మానవరహిత వైమానిక వ్యవస్థలు (యుకావ్‌) ధ్వంసమయ్యాయి. పాక్‌ వాయుసేన సిబ్బంది ఇందులో హతమయ్యారు. భొలారి, సుక్కుర్, మురీద్‌ వంటి లక్ష్యాలపై దాడులు జరిగాయి. నష్టం వివరాలను తెలిపే ఉపగ్రహ చిత్రాలనూ నివేదిక ప్రస్తావించింది. సర్గోధా, రహీమ్‌ యార్‌ఖాన్‌లోని పాకిస్థాన్‌ సైనిక రన్‌వేలనూ భారత వాయుసేన ధ్వంసం చేసింది. తద్వారా సైనిక కార్యకలాపాలకు పాక్‌ వాయు స్థావరాలను ఉపయోగించలేని స్థితికి తీసుకెళ్లింది. చక్లాలా, మురీద్‌లలోని పాక్‌ కమాండ్, కంట్రోల్‌ మౌలిక వసతులను భారత్‌ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులద్వారా పాక్‌ వైమానిక స్థావరాలే కాకుండా ఆ దేశ గగనతల రక్షణ ప్రతిస్పందన వ్యవస్థనూ భారత్‌ దెబ్బతీసింది. భారత సమీకృత గగనతల రక్షణ ఆపరేషన్లకు మన వాయుసేనకు చెందిన ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ వెన్నుదన్నుగా నిలిచింది. గాల్లోని లక్ష్యాలను గుర్తించడం, వర్గీకరించడం చేసింది. పాక్‌ తన గగనతలంలో పౌర విమానాలను అనుమతించినప్పటికీ వాటికి నష్టం జరగకుండా భారత వైమానిక దళం చర్యలు చేపట్టింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





