
‘గాంధీ’ కుటుంబంపై మధ్యప్రదేశ్‌ సీఎం వ్యాఖ్యలు ఆగర్‌ మాల్వా: దేశ రాజధాని నగరమైన దిల్లీలో పోటీ చేసే సత్తా లేని నెహ్రూ- గాంధీ కుటుంబికులు ఉత్తర్‌ ప్రదేశ్‌ దాటి వయనాడ్‌దాకా వెళ్లారని.. మధ్యలో సముద్రం అడ్డుగా లేకపోతే అరబ్‌ దేశాల్లోనూ వారు పోటీ చేసేవారేమోనని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ‘లాడ్లీ బెహెన్‌’ నిధుల బదిలీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పప్పు’గా పేరొందిన రాహుల్‌ గాంధీ కొత్త సాంకేతికతతో పురోగమిస్తున్న భారత్‌ ప్రగతిని అంగీకరించకపోవడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఈ నెల 19న ఇందౌర్‌లో రాహుల్‌ పాల్గొననున్న ‘ఛాత్రోంకీ గూంజ్‌’ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందన్నారు. యువత గురించి మాట్లాడే మిషతో అబద్ధాల పరంపర ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో చాలా ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినా బందిపోట్లను, నక్సలైట్లను అరికట్టడంలో విఫలమైనందుకు ప్రజలను క్షమాపణ కోరాక రాహుల్‌ మధ్యప్రదేశ్‌కు రావాలని మోహన్‌ యాదవ్‌ డిమాండు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





