
MLC Ramchandar : తెలంగాణ రాష్ట్రంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించుకోవడానికి గణేశ్ మండప నిర్వాహకులకు విధిగా పూర్తిస్థాయి సహకారం అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసేలా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా రేవంత్ రెడ్డి సర్కార్‌కి ఆ విఘ్నేశ్వరుడు ‘సద్బుద్ధి’ ని ప్రసాదించాలని తాను వేడుకున్నట్లు వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం పాడిపంటలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ప్రతీ కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించేలా గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఏటా గణేశ్ ఉత్సవాలపట్ల ప్రజల్లో భక్తిప్రపత్తులు ఇనుమడిస్తున్నాయని, ఊరూరా ప్రజలు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో భాగస్వాములు కావడంపట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. భక్తులకు, మండపాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు భద్రతా, రవాణా ఏర్పాట్లను పటిష్ఠం చేయాలని సూచించారు.





