
అభిరామ్, పాయల్‌ రాధాకృష్ణ, వంశీ, బాలాజీ ‘హ్యాపీ జర్నీ’ చిత్రానికి ప్రేక్షకులే హీరోలని దర్శకుడు అభిరామ్‌ నాయుడు అన్నారు. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే కథతో అభిరామ్‌ తెరకెక్కించిన ఈ సినిమాని బాలాజీ గుత్తా, కౌశిక్‌ రెడ్డి నిర్మించారు. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్‌ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. దర్శకుడు అభిరామ్‌ నాయుడు మాట్లాడుతూ.. ‘‘వినోదం, భావోద్వేగాల మేళవింపుగా ఉంటుంది. ఆఖర్లో మంచి సందేశాన్ని అందిస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాయల్‌ రాధాకృష్ణ, వంశీ, పృథ్వీ, సునయన, జినీషా, రూప, తరుణ్, ఛోటా కే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. స్నేహం + దేశభక్తి = సీక్రెట్‌ సోల్జర్‌ సూర్య శ్రీనివాస్, నిహాల్‌ గూఢచర్యం ప్రధానంగా సాగే సినిమాల్లో వాస్తవిక కోణాన్ని ఆవిష్కరించే చిత్రమే మా ‘సీక్రెట్‌ సోల్జర్‌’ అంటున్నారు నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌. ఈ ఇద్దరూ హీరోలుగా అక్కి విశ్వనాథ్‌ రెడ్డి దర్శకనిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ నెల 18న రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో నిహాల్‌ కోదాటి మాట్లాడుతూ ‘‘నెల్లూరుకు చెందిన ఓ సాధారణ కుర్రాడైన వలి, అతని స్నేహితుడు పృథ్వీ ఓ కీలకమైన మిషన్‌లో ఎలా భాగమయ్యారు? వాళ్లిద్దరూ ఆ మిషన్‌ని పూర్తి చేశారా? లేదా? అన్నదే ఈ సినిమా కథ. స్నేహం, దేశభక్తి మేళవింపుతో కూడిన కథలు అరుదు. ఈ సినిమాలో అది కుదిరింది’’ అన్నారు. ‘‘హాస్యం, మలుపులు, గూఢచర్యంతో కూడిన ఒక ప్రత్యేక ప్రపంచం... ఇలా ఎన్నో విషయాలు ఇందులో ఉన్నప్పటికీ స్నేహం నేపథ్యంలోని భావోద్వేగమే ఈ కథలో ప్రధానం. ఈ సినిమాతో మా బృందం అంతటికీ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సూర్య శ్రీనివాస్‌. హర్ష్‌ రోషన్, నక్షత్ర జంటగా రమేశ్‌ బండ్రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘తెల్ల కాగితం’. కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. దీపక్, అజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబరు 2న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్‌ దేవరకొండ శనివారం ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. ‘‘తెలుసా తెలుసా.. చిలిపి మనసా.. నువు నా జతలో దీపం’’ అంటూ సాగిన ఈ మెలోడీ పాటకు విజయ్‌ బుల్గానిన్‌ స్వరాలు సమకూర్చగా.. సురేశ్‌ బన్నిశెట్టి సాహిత్యమందించారు. అనుదీప్‌ దేవ్, లిప్సిక ఆలపించారు. ధృవ్‌ విక్రమ్‌ హీరోగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం శ్రీకారం చుట్టుకుంది. పెన్‌ జయంతిలాల్‌ సమర్పణలో కోనేరు సత్యనారాయణ, శిరీష నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు శనివారం ప్రకటించారు. ఆకట్టుకునే కథ.. బలమైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్‌ మేళవింపుగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ముస్తాబు కానుందని.. ఈ నెల 23న ధృవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నామని చిత్ర వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం.. అక్టోబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




