
ప్రముఖ నటి పావలా శ్యామల మృతితో ఆమె కుమార్తె మాధవి ఒంటరిగా మిగిలారు. ఈ నేపథ్యంలో మాధవి బాగోగులను చూసుకునేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ముందుకొచ్చింది. మాధవిని రమణాచారి ట్రస్ట్‌కు చెందిన ఆశ్రమంలో చేర్పించి, ఆమె సంరక్షణ బాధ్యతలను అప్పగించింది.
ఈ సందర్భంగా ‘మా’ అసోసియేషన్ ట్రెజరర్‌ నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘‘పావలా శ్యామల విషయంలో తమ అసోసియేషన్ ఎలాంటి సహాయం చేయలేదంటూ గతంలో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వచ్చాయని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సూచనతో పావలా శ్యామలకు ‘మా’ అసోసియేషన్ కార్డు ఇచ్చామని, అనంతరం నెలకు రూ.6 వేల చొప్పున పెన్షన్ కూడా అందించినట్లు’’ శివ బాలాజీ చెప్పారు.
అయితే పావలా శ్యామల మరణించిన తర్వాత ఆమె కుమార్తె మాధవికి అదే విధంగా పెన్షన్ అందించే హక్కు ‘మా’ అసోసియేషన్‌కు లేదని శివ బాలాజీ స్పష్టం చేశారు. అయినప్పటికీ మానవత్వంతో మాధవిని రమణాచారి ఆశ్రమంలో చేర్పించినట్లు వెల్లడించారు.
మాధవి భవిష్యత్ అవసరాల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని శివ బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. మాధవికి సహాయం చేయాలనుకునే దాతలు ‘మా’ అసోసియేషన్ క్యూఆర్ కోడ్ ద్వారా తమ విరాళాలను అందించవచ్చని కోరారు.






