
ముంబై: తన కుమారుడి మరణానికి కోడలు కారణమని మామ అనుమానించాడు. చేతబడి చేసి తన కొడుకును ఆమె చంపించినట్లు భావించి గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో కోడలిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత బావిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. (man kills daughter-in-law) అయితే అగ్నిమాపక సిబ్బంది అతడ్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 70 ఏళ్ల నత్తుమల్ భగవాన్ పాలి కుమారుడైన రవిశంకర్ 2019లో మరణించాడు. 42 ఏళ్ల కోడలు లక్ష్మి చేతబడి చేయించడం వల్లనే తన కొడుకు మరణించినట్లు మామ అనుమానించాడు. దీంతో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి లక్ష్మి వేరుగా నివసిస్తున్నది. కాగా, సెప్టెంబర్ 11న రాత్రి సమయంలో తన కుమారుడి మరణం విషయంపై కోడలు లక్ష్మి, మామ నత్తుమల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం వేళ ఇంటి వెనుక ఆవరణలో బట్టలు ఉతుకుతున్న కోడలిపై మామ గొడ్డలితో దాడి చేశాడు. ఆమెను నరికి చంపాడు. అనంతరం నత్తుమల్ ఒక బావిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అగ్నిమాపక సిబ్బంది అతడ్ని రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు లక్ష్మి హత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇద్దరు పిల్లలు ఇంట్లో లేని సమయంలో మామ నత్తుమల్ కోడలిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. తన కొడుకు మరణానికి ఆమె కారణమని అనుమానించి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






