
Boat accident : ఇండోనేషియాలో ఘోర నౌక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో 130 మంది గల్లంతయ్యారు. మొత్తం 213 మంది ప్రయాణికులు, 30 మంది సిబ్బందితో కలిపి 243 మందితో ప్రయాణిస్తున్న ‘వర్గో ట్రాన్స్పోర్ట్ 8’ అనే నౌక జావా సముద్రంలో మునిగిపోయింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 107 మందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. మరో ఆరుగురి మృతదేహాలను వెలికితీశాయి. ఇంకో 130 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు జావాలోని సురబయ నుంచి శనివారం బయలుదేరిన నౌక.. దక్షిణ కాలిమంటన్లోని బంజర్మాసిన్కు వెళుతోంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కెప్టెన్ నుంచి అధికారులకు చివరి సందేశం అందింది. సముద్రంలో దాదాపు మూడు మీటర్ల ఎత్తున అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని, దాంతో నౌక ఒకవైపునకు ఒరిగిపోతోందని ఆయన తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బంజర్మాసిన్ రేవుకు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. నౌకాదళానికి చెందిన నౌకతో సహా నాలుగు నౌకలు, ఒక హెలికాప్టర్, సమీపంలోని టగ్బోట్ల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. కాపాడిన వారిని సమీపంలోని తూర్పు జావా పోర్టుకు తరలిస్తున్నారు. మరోవైపు బంజర్మాసిన్లోని త్రిశక్తి పోర్టు వద్ద గల్లంతైన వారి బంధువులు వందలాదిగా గుమిగూడారు. ప్రయాణికుల జాబితాలను చూస్తూ తమ వారి క్షేమ సమాచారం కోసం తీవ్ర ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. వేలాది ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో రవాణాకు ఫెర్రీలపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే భద్రతా లోపాల కారణంగా ఇక్కడ తరచూ ఇలాంటి సముద్ర ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా అధికారిక రికార్డుల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్యకు, వాస్తవంగా నౌకలో ఉన్నవారి సంఖ్యకు తేడా ఉండటం ఇక్కడ సర్వసాధారణమని, దాంతో గల్లంతైన వారి కచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు.





