
– సీఐటీయూ ఏరియా ప్రధాన కార్యదర్శి పిచ్చేటి శివ రుద్రంపూర్, సెప్టెంబర్ 15 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పని చేస్తున్న పారిశుధ్య కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ కొత్తగూడెం ఏరియా ప్రధాన కార్యదర్శి పిచ్చేటి శివ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారనే భావన వారిలో నెలకొంటోందని, ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం సీఐటీయూ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీపింగ్, స్కావెంజింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. పని వేళల్లో చిన్న తప్పులు జరిగినా ఆబ్సెంట్ వేస్తున్నారని, దీనివల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఈ సందర్భంగా పిచ్చేటి శివ మాట్లాడుతూ.. కాంట్రాక్టు కార్మికులు యంత్రాలు కాదని, మనుషులనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. కార్మికులపై ఒత్తిడి పెంచడం, వేధింపులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంఘం అండగా ఉంటుందని తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురిచేస్తే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామని హెచ్చరించారు. కార్మికుల శ్రమను గుర్తించి, వారికి గౌరవప్రదమైన పని వాతావరణం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ బుక్య రమేష్, ట్రెజరర్ ప్రమోద్, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.





