
ఇందుకూరుపేట: పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమ కోఆర్డినేటర్ పందిపాటి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పొణకా కనకమ్మ 64వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో మహానుభావులు తమ సర్వస్వం ధారబోశారని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో నెల్లూరుకు చెందిన ధీరవనిత పొణకా కనకమ్మ జాతీయ ఖ్యాతి తెచ్చారని చెప్పారు. ‘‘పల్లెపాడులో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని మహాత్మాగాంధీ స్వహస్తాలతో ప్రారంభించారు. ఈ ఆశ్రమం కోసం కనకమ్మ తన ఒంటిపైనున్న బంగారు నగలు అమ్మి విరాళంగా ఇచ్చారు. ఆనాటి నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆమె బంగారు నగలు ధరించలేదు. పల్లెపాడు పెన్నానది ఒడ్డున గాంధీ ఆశ్రమం కోసం 13 ఎకరాలు కొని స్వరాజ్యం సంపాదించాలనే ధ్యేయంతో పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు. 1930లో పల్లెపాడులో జరిగిన ఉప్పు సత్యాగ్రహం కార్యక్రమంలో కనకమ్మ ప్రముఖ పాత్ర వహించారు. ఆమె నాయకత్వంలో మైపాడుకు భారీ స్థాయిలో మహిళలు తరలి వెళ్లారు’’అని జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఆశ్రమ కమిటీ సభ్యురాలు కందికట్టు రాజేశ్వరి మాట్లాడుతూ.. ఫొణకా కనకమ్మ గారు ఎన్నో దానధర్మాలే కాకుండా స్వతంత్ర ఉద్యమకారిణిగా, రచయితగా ఎన్నో సేవలు అందించారని చెప్పారు. ఆ రోజుల్లో బాలికా విద్య కోసం ఆమె కస్తూర్బా బాలికా విద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వీరవనిత కనకమ్మలాంటి మహోన్నత వ్యక్తి శిలావిగ్రహం నెల్లూరు నగరంలో కనీసం ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





